30-08-2024
తెలంగాణ
- డప్పు చప్పుళ్లతో పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు
- గ్రామ దేవతకు మొక్కులు తీర్చుకున్న గ్రామ ప్రజలు
నాగర్ కర్నూల్ జిల్లా, చారకొండ మండలంలోని జేపల్లి గ్రామంలో పోచమ్మ అమ్మవారి బోనాలు గురువారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టి పడేలా మహిళలు, ఆడపడుచులు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో డప్పు చప్పుళ్లు నడుమ యువకులు, పిల్లల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బోనాల సందర్భంగా గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకల్లో భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని పోచమ్మ అమ్మవారికి, కోట మైసమ్మ అమ్మవారికి భక్తిశ్రద్దలతో పూజలు నిర్వహించి, దీప, దూప, నైవేద్యాలు సమర్పించి, కోరిన కోర్కెలు తీర్చాలని అమ్మవారికి మొక్కులు సమర్పించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పలువురు ప్రముఖులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.