07-09-2024 RJ
తెలంగాణ
-ముఖ్యమంత్రికి సొసైటీ సమావేశంలో విజ్ఞప్తి
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నందుకు గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో-ఆపరేటీవ్ హౌసింగ్ సొసైటీ (జీజేహెచ్‌ఎస్) ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ నేపథ్యంలో తమ సొసైటీకి కూడా ఇళ్ల స్థలాలపై సీఎం ప్రకటన చేయాలని, ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ వెంటనే జీవో జారీ చేయాలని సమావేశం విజ్ఞప్తి చేసింది. శుక్రవారం చిక్కడపల్లిలోని త్యాగరాయ గానసభలో సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇళ్ల స్థలాల సమస్యపై చర్చించి తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మామిడి సోమయ్య మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉందని, గత ప్రభుత్వం సమస్యను పరిష్కరించకుండా జర్నలిస్టులకు మోసం చేసిందని అన్నారు.
ఎన్నికలకు ముందు, అధికారలోకి వచ్చిన తర్వాత తాము ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరామని, సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అన్నారు. తమ సొసైటీలో ఉన్న దాదాపు 1300 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి,పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు తదితర మంత్రులను, మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించామన్నారు. సీఎం పలు సందర్భాల్లో జర్నలిస్టులకు ఇళ్లస్థలాల విషయంలో సానుకూలంగా ఉన్నట్లు చెప్పారని అన్నారు. 2008లో ఏర్పడిన తమ సొసైటీకి కూడా రేవంత్‌రెడ్డి ఇంటి స్థలం ఇస్తారన్న సంపూర్ణ విశ్వాసం ఉందని మామిడి సోమయ్య ధీమా వ్యక్తంచేశారు. జవహర్ లాల్ నెహ్రూ సొసైటీకి ఇళ్ల స్థలాలు ఇవ్వనున్న నేపథ్యంలో తమకూ ఇచ్చేలా ప్రకటన చేయాలని ఆయన సీఎంను కోరారు. అలాగే ప్రకటనతోపాటు నిర్ణీత సమయంలో ఇంటి స్థలం ఇచ్చేలా ప్రకటన చేయాలని సర్వసభ్య సమావేశం ప్రభుత్వాన్ని కోరింది.
ఈ సందర్భంగా పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది. ఈ సమావేశంలో సొసైటీ కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ నివేదిక సమర్పించగా సొసైటీ కోశాధికారి తన్నీరు శ్రీనివాస్, డైరెక్టర్లు యర్రమిల్లి రామారావు, గజ్జల వీరేశం, భాస్కర్ రెడ్డి, మహిళా సభ్యులు నాగవాణి, శాంతి తదితరులు ప్రసంగించారు. ప్రత్యేక అతిథులుగా హాజరైన తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు ఆనంచిన్ని వెంకటేశ్వర రావు, ఆలిండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే.కోటేశ్వర రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యతో పాటు అన్ని సమస్యలను సంపూర్ణంగా పరిష్కరిస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారం చేసి చూపించాలని, లేదంటే గత ప్రభుత్వంలో మాదిరిగా జర్నలిస్టుల్లో వ్యతిరేకత వస్తుందని అన్నారు. ఇళ్ల స్థలాల సాధన కోసం గ్రేటర్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ చేస్తున్న పోరాటానికి తమ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తాయని అన్నారు.