03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు వేల కోట్ల రూపాయల ఇసుక దోపిడీకి పాల్పడలేదని ఆ పార్టీ అధినేత పట్టాభిరామ్ అన్నారు. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలు జరిగాయని వస్తున్న ఆరోపణలపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
ఈ నేపథ్యంలో పట్టాభి పై విధంగా స్పందించారు. ఇసుకాసురుడు జగన్‌రెడ్డి మాదిరిగా చంద్రబాబు వేల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడలేదని.. జనాలపై కోట్ల రూపాయల భారం మోపలేదని పట్టాభి అన్నారు.
ఇసుకను ప్రజలకు ఉచితంగా అందించడమే చంద్రబాబు చేసిన నేరమా అంటూ వైసీపీ సర్కారుపై మండిపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇసుక దోపిడీని బయట పెట్టిన కారణంగానే టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని,
చంద్రబాబుపై కేసు పెట్టడం దుర్మార్గమని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్‌రెడ్డి పాల్పడిన రూ.40 వేల కోట్ల ఇసుక దోపిడీకి అన్ని రకాలుగా సహకరించిన వ్యక్తి వెంకటరెడ్డి అని, ఆ వ్యక్తే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని టీడీపీ నేత అన్నారు. వెంకటరెడ్డి పెద్ద అవినీతి తిమింగలమని వ్యాఖ్యానించారు. ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచడంతోనే రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. టెండర్ విధానాన్ని కొనసాగించి ఉంటే కోట్ల రూపాయల రాబడి వచ్చేదని చెప్పారు. ఇసుకను ఉచితంగా ఎలా ఇస్తారని పేర్కొనడం తప్ప సీఐడీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో అవినీతి ఆరోపణలను నిరూపించే ఒక్క అంశం కూడా లేదన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్, ఫైబర్‌నెట్, ఇన్నర్‌రింగ్ రోడ్డు కేసుల్లో సీఎం జగన్ ఒక్క సాక్ష్యాన్ని కూడా కోర్టుల్లో గానీ, ప్రజల ముందుగానీ ఉంచలేకపోయారని చెప్పారు.