03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
రామ్‌గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వ్యూహం’ చిత్రం టీడీపీ శ్రేణులను కలవరానికి గురిచేస్తోంది. ఏపీ రాజకీయాలు ఇతివృత్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఆర్జీవీ ముందే చెప్పారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, ట్రైలర్‌లు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.
టీడీపీని, చంద్రబాబును కించపరిచేలా ఈ సినిమాను చిత్రీకరించినట్లు ఆ పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యూహం చిత్రాన్ని నవంబర్ 10వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇది వరకే ప్రకటించింది.
అయితే తాజాగా ఈ సినిమా విడుదలను ఆపాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరుకుంటున్నారు. ఇందులో భాగంగానే సినిమా విడుదలకు అనుమతి ఇవ్వకూడదని కోరుతూ సెన్సార్ బోర్డుకు లేఖ కూడా రాశారు. ఆరు పేజీలతో కూడిన లేఖలో లోకేష్ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
సెన్సార్ బోర్డ్‌కు రాసిన లేఖలో లోకేష్.. సీఎం జగన్ పదవీకాలం వచ్చే ఏడాది జూన్ తో ముగియనుందని.. ఈ నేపథ్యంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే లక్ష్యంతో జగన్‌పై వ్యూహం చిత్రాన్ని తీస్తున్నారని తెలిపారు.
ఇక ఈ సినిమాలో చంద్రబాబుతో పాటు తనను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని, ఇవి పరువు నష్టం దావా కిందకు వస్తాయని లోకేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ విడుదలైన సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని, తన తండ్రి జైల్లో ఉన్నారని..
ఆ కారణంగానే ట్రైలర్‌లో సదరు సన్నివేశాలు ఉన్నట్లు తమకు తెలియలేదని లోకేష్ లేఖలో ప్రస్తావించారు. వ్యూహం సినిమా ట్రైలర్ దర్శకుడు, నిర్మాత మాట్లాడిన మాటల ఆధారంగా ఫిర్యాదు చేస్తున్నట్లు లోకేష్ తెలిపారు.