03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
తాగిన మత్తులో ఓ మందుబాబు డ్యూటీ డాక్టర్‌పై దాడి చేశాడు. విజయనగరం జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో డ్యూటీలో ఉన్న హౌస్ సర్జన్ సువర్ణ కుమార్‌పై దాడి దిగాడు. అంతే కాకుండా ప్రక్కనే ఉన్న మరో మహిళ హౌస్ సర్జన్‌ను సైతం అసభ్యకర పదజాలంతో దూషిస్తూ వీరంగం సృష్టించాడు.
మద్యం మత్తులో ఉన్న మందుబాబును పలువురు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. చేసేదిలేక వెంటనే డాక్టర్లు అదే ఆసుపత్రి ఔట్ పోస్టులో ఉన్న పోలీసులకు గొడవకు గురించి సమాచారం ఇచ్చారు.
అయితే ఆ సమయంలో డ్యూటీలో ఉన్న పోలీసులు కూడా వెంటనే స్పందించకపోగా తెల్లవారిన తరువాత చూద్దాం, ఇప్పుడు మీరు వెళ్లిపోండి అని చెప్పి వైద్యులను ఔట్ పోస్ట్ నుండి పంపించేశారు. ఆ సమయంలో చేసేదేమీ లేక డాక్టర్లు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు.
ఉదయాన్నే జరిగిన విషయాన్ని తమ తోటి డాక్టర్స్ తో పాటు ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆందోళనకు దిగారు. అంతటితో ఆగకుండా తమపై దాడి చేసిన వారి పై చర్యలు తీసుకునే వరకు విధులకు హాజరు కాలేమని తేల్చి చెప్పారు.
అప్పటికే రైలు ప్రమాద ఘటనలో గాయపడి అదే ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు హౌస్ సర్జన్స్ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో జరిగిన ఘటనతో వైద్యులు విధులకు హాజరు కాకపోతే రోగులు తీవ్ర ఇబ్బంది పడతారని గమనించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి చేసిన నిందితుడు వచ్చిన కారును గమనించిన హౌస్ సర్జన్స్ ఆ కారు నెంబరును పోలీసులకి ఇచ్చారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రక్రియ ఈజీగా మారింది. అలా ఆ కార్ నెంబర్ సహాయంతో డాక్టర్స్ పై దాడికి దిగిన నిందితుడిని యశ్వంత్ గా గుర్తించారు.