03-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మొత్తం 38 అంశాలపై చర్చ జరిగింది. ఇటీవల రాష్ట్ర పరిశ్రమల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మొత్తం రూ.19వేల 37 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర కేబినెట్ అంగీకరించింది. వివిధ రంగాల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో పాటు ఇప్పటికే నడుస్తున్న పరిశ్రమల విస్తరణకు ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 69 వేల 565 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ధాన్యం కొనుగోలు కోసం ఏపీ మార్క్ ఫెడ్ కు ప్రభుత్వ గ్యారంటీతో రూ. 5 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఇచ్చిన జీవోకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా రవాణా, రోడ్లు భవనాల శాఖకు చెందిన 139 అతిథి గృహాల్లో 467 మంది సిబ్బందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించేందుకు మంత్రిమండలి అంగీరించింది.
ఇక ఇదే శాఖల్లో కొత్తగా పలు కొత్త యూనిట్లు ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలవుతున్న తీరుపై మంత్రి మండలి చర్చించింది.
ఇంటింటికీ వైద్య పరీక్షలు, అవసరం ఉన్నవారికి ఆరోగ్యశ్రీ చికిత్స అందించేలా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు.
పరిశ్రమల శాఖలో కొత్తగా భూకేటాయింపుల పాలసీకి మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దసరా కానుకగా ఉద్యోగులకు డీఏకు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.