06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
మృత్యువు ఏ రూపంలో ఎటునుంచి వస్తుందో తెలీదు. విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్లో సోమవారం ఉదయం ఘోర ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఓ బస్సు ప్రయాణికులపైకి దూసుకెళ్లింది.
దీంతో పది నెలల చిన్నారి సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బస్టాండ్ లోని 12వ నెంబర్ ప్లాట్ ఫాంపై బస్సు కోసం ఓ మహిళ, చిన్నారితో పాటు గుంటూరు 2 డిపోకు చెందిన కండక్టర్ వీరయ్య ఎదురుచూస్తున్నారు.
ఊహించని పరిణామం వల్ల ఈ ముగ్గురూ మృతి చెందారు. గుంటూరుకు వెళ్లాల్సిన ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు ఫ్లాట్ ఫాంపైకి వచ్చే క్రమంలో బ్రేకులు ఫెయిలయ్యాయి. రివర్స్ గేర్ బదులుగా డ్రైవర్ ఫస్ట్ గేర్ వేయడంతో బస్సు ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులపైకి వెళ్లింది.
దీంతో బస్సు చక్రాల కింద పడి ముగ్గురు చనిపోయారని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. కాగా, ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.