06-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు తెలుగురాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంద్రప్రదేశ్‌లో కోడిపందాలు, ఎడ్ల పందాల హడావిడి అంతా ఇంతా కాదు. తెలుగు ప్రజలకు ఇది అతి పెద్ద పండగ అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు.
అయితే ప్రస్తుతం పందెం కోళ్లు పెంచుతున్న వాళ్లు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రతి యేటా సంక్రాంతి పండుగకు ఏపీలోని గోదావరి జిల్లాలో పెద్ద యెత్తున కోడిపందాలు జరుగుతాయి.
పండుగ మూడు రోజుల పాటు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారతాయి. అలాంటి పందాల కోసం పోటీ పడే పందెం కోళ్లు సైతం వేల రూపాయలు.. కాదు లక్షల రూపాయలు కూడా పలుకుతాయి.
ఒక జాతి పందెంకోడి పెంపకానికి సుమారు 25 వేల వరకు ఖర్చు అవుతుంది. అలా పెంచిన కోడి పుంజులను వాటి రంగు, పోరాట పటిమ, ఎత్తు చూసి 50 వేల నుంచి 5 లక్షల వరకు అమ్ముతారు.
సంక్రాంతి పండుగకు రెండు మూడు నెలల ముందు నుంచే గోదావరిజిల్లాలో రకరకాల పందెం కోళ్లను కొందరు ప్రత్యేకంగా పెంచుతారు. అయితే ఆ కోళ్లను పెంచే పెంపకం దారులకు ఇప్పుడు కంటిమీదకునుకు లేకుండా పోయింది.
దానికి కారణం ఇటీవల పందెం కోళ్ల దొంగతనాలు ఎక్కువయ్యాయంట. ఎంతో కష్టపడి పెంచిన పుంజులను నూజివీడు పరిసర ప్రాంతాల్లో రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళ్లిపోతుండటంతో పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు.
నూజివీడు మండలం రావిచర్లకు చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు దంపతులను దొంగలు కత్తితో బెదిరించి కోళ్ల ఫాంలో పెంచుతున్న 4 లక్షలు విలువ చేసే పందెం పుంజులను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.