07-11-2023 Super
తెలంగాణ
దసరా రోజున ఆయుధ పూజ సందర్భంగా నిషేధిత ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించడంతో గోషామహల్ బీజేపీ అభ్యర్థి ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. మంగళ్‌హట్ పోలీసులు ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు.
తుపాకులు, కత్తులు ప్రదర్శించి రాజా సింగ్ పూజలు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. అక్టోబర్ 16న రాజాసింగ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన ఈ వీడియోలో విద్వేషపూరిత ప్రసంగం ఉందని పోలీసులు పేర్కొన్నారు. నవరాత్రి దాండియా కార్యక్రమాలు,
వేడుకలకు ముస్లింలను అనుమతించవద్దని నిర్వాహకులను రాజాసింగ్ కోరారు. అంతేకాదు కార్యక్రమానికి హాజరైన వారందరి గుర్తింపు కార్డులను పరిశీలించాలని, ఈవెంట్ కోసం ముస్లిం బౌన్సర్లు, వీడియోగ్రాఫర్లు, డీజే నిర్వాహకులు లేదా ఇతర వ్యక్తులను నియమించుకోవద్దని వీడియోలో కోరారు.
ఈ వీడియోపై స్థానిక లీడర్ ఎంఏ సమద్ వార్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఐపీసీ 153ఏ, 295ఏ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. దీనిపై రాజాసింగ్ స్పందిస్తూ, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నోటీసులు జారీ చేసిందని చెబుతున్నారు.