07-11-2023 Super
తెలంగాణ
బీజేపీ ఆత్మగౌరవ సభపై వీహెచ్ ఆగ్రహం..
బీసీ ఆత్మగౌరవ సభపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత రావు మంగళవారం స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ప్రధాని నరేంద్రమోడీకి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలు గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు.
బీసీల కోసం కృషి చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఓబీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని చెప్పారు. ఇలాంటి సమయంలో మోడీకి బీసీల ఆత్మగౌరవం గుర్తుకు వచ్చిందా? అన్నారు.
ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్లు కావాలని కోర్టుకు వెళ్తే... అవకాశం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కావాలని అడిగిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు నరేంద్ర మోడీ పక్కన చేరారని విమర్శించారు.
పవన్ కల్యాణ్‌ను బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారని ఆరోపించారు. బీసీల గురించి చెబుతున్న పవన్ కల్యాణ్ కాపు వ్యక్తి అని చెప్పారు. ప్రైవేటు పరిశ్రమలలో రిజర్వేషన్స్ ఎందుకు అడగలేదో చెప్పాలన్నారు. మోడీ ఓబీసీలకు చేస్తున్న మోసాన్ని అందరూ గమనించాలన్నారు.