07-11-2023 Super
తెలంగాణ
తెలుగు రాష్ట్రాల సభల్లో పాల్గొనడానికి ఎప్పుడు వచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ ముందుగా తెలుగులో మాట్టాడి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. బీసీల అత్మగౌరవ సభలో పాల్గొనేందుకు ఆయన మంగళవారం హైదరాబాద్ వచ్చారు.
ఈ సభలో మోడీ సమ్మక్క సారలమ్మ... యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి వారిని తలుచుకున్నారు. ప్రసంగం సమయంలో నీళ్లు, నిధులు, నియామకాలు అనే పదాల్ని తెలుగులో పలికారు. నా కుటుంబ సభ్యులారా.. అంటూ పలుమార్లు పలికి అందరినీ అలరించారు.
పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎల్బీ స్టేడియంతో తనకు అనుబంధం ఉందని, పదేళ్ల క్రితం ఈ స్టేడియంలో ప్రజలు ఆశీర్వదించడంతో తాను ప్రధానిని అయ్యానని వ్యాఖ్యానించారు. ఇదే మైదానం సాక్షిగా ఇప్పుడు తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నారన్నారని..
నాటి నా సభలో ప్రసంగం కోసం టిక్కెట్ పెట్టారని, దేశంలోనే ఇదో కొత్త ప్రయోగం అని గుర్తు చేసుకున్నారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యతిరేక ప్రభుత్వం ఉందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ అది నెరవేరలేదని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల ఆకాంక్షలను ఇక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇలాంటి వారిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు మార్పును కోరుకుంటున్నారని.. అదే సమయంలో అబ్దుల్ కలాంను, ద్రౌపది ముర్ములను రాష్ట్రపతిని చేసింది తామేనని గుర్తు చేశారు. లోక్ సభలో తొలి దళిత స్పీకర్ బాలయోగిని చేసింది కూడా బీజేపీనే అని చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏలో మూడు అంశాలు అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు కామన్‌గా ఉంటాయన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదని గుర్తుంచుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చింది బీజేపీనే అన్నారు. బీసీల ఆకాంక్షలను నెరవేరుస్తామని చెప్పారు. బీసీలకు ఏడాదికి రూ.1000 కోట్ల ఫండ్స్ ఇస్తామని బీఆర్ఎస్ చెప్పింది కానీ చేయలేదన్నారు.
కేంద్ర కేబినెట్లో అత్యధిక బీసీలు కేంద్రమంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. ఓబీసీలకు చెందిన ఎక్కువ మందికి ఎంపీలుగా బీజేపీ అవకాశమిచ్చిందని చెప్పారు. తెలంగాణలో ఈసారి బీజేపీని గెలిపించి బీసీని సీఎంగా చేసుకోవాలని సూచించారు.