07-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా ఆయనపై ఇసుక కేసును కూడా ఏపీ సీఐడీ నమోదు చేసింది. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది.
ఈ కేసులో ఏ1గా పీతల సుజాత, ఏ2గా చంద్రబాబు, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ4గా దేవినేని ఉమా పేర్లను చేర్చింది. దీంతో ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
విధానపరమైన నిర్ణయాలను తప్పుపడుతున్నారని పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. తవ్వకం, రవాణా ఖర్చులను మాత్రం ప్రజలు భరించారు. దీంతో, ఒక ట్రక్కు ఇసుక కేవలం రూ. 2 వేలకే ప్రజలకు చేరింది. ఇసుకను ఉచితంగా ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి రూ. 1,300 కోట్ల నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ, ఇసుక పాలసీపై ప్రభుత్వం తాజాగా కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుకను కేబినెట్ సమావేశంలో చర్చించలేదని ఎఫ్ఐఆర్ లో సీఐడీ పేర్కొంది.