08-11-2023 Super
ఆంధ్రప్రదేశ్
దేశ ప్రజలంతా దీపావళి పండగ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో వాతావరణ కాలుష్యంపై కూడా ప్రతి ఏడాది చర్చ జరుగుతూనే ఉంది. ఈ తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
బాణసంచా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. బాణసంచా నియంత్రణ ఆదేశాలు ఒక్క ఢిల్లీకే పరిమితం కాదని, అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయని జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం పేర్కొంది.
హానికర రసాయనాలపై గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశమంతా ఒకేలా వర్తిస్తాయని స్పష్టం చేసింది. తమ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాల కార్యాచరణ ఉండాలని ద్విసభ్య ధర్మాసనం చెప్పింది. బాణసంచా వినియోగం నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రాజస్థాన్ లో బాణసంచా కొనడం, అమ్మడం, వినియోగించడం నిషేధించాలని పిటిషనర్ కోరారు.