10-11-2023 Super
తెలంగాణ
శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో "భారత్ బచావో" నిర్వహించిన సమావేశంలో TPJAC కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ భ్రమలు కల్పిస్తూ, కెసిఆర్ అవినీతి లో అగ్రభాగాన నిలిచాడని విమర్శించారు. సంక్షేమ కార్యక్రమాలను చూపించి రాష్ట్రంలో మద్యం ఏరులై పారించడంలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు.
ఏకపక్ష నిర్ణయాలతో కమిషన్ల కొరకు కాళేశ్వరం రీడిజైన్కు పాలుపడ్డారు. జీవనోపాధి లేక, కుటుంబ భారం మోయలేక తెలంగాణ నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. TSPSC అక్రమాలకు, అవినీతికి, లీకేజీలకు పాల్పడుతున్నా, ప్రక్షాళనకు సిద్ధపడడం లేదని విమర్శించారు.
రైతుబంధు పేరిట వేలకోట్ల రూపాయిలను వందలాది ఎకరాలున్న భూస్వాములకు కట్టబెడుతున్నారని విమర్శించారు. అందుకే భూస్వామ్య అహంకారంతో, ప్రజా వ్యతిరేక నియంతృత్వ పాలనా కొనసాగిస్తున్న కెసిఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని
పిలుపునిచ్చారు. ప్రజల హక్కులకు, ప్రజాస్వామిక పాలనకు తెలంగాణ ప్రజలు ఉద్యమించాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో భారత్ బచావో వైస్ చైర్మన్ డాక్టర్ గోపినాథ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధనకై తెలంగాణ సమాజం ప్రభుత్వ నిర్బంధాలను ఎదురించి, పన్నెండొందలమంది బలిదానాలతో స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలియజేసారు.
ఈ సందర్భంగా భారత్ బచావో జాతీయ కౌన్సిల్ మెంబెర్ సోమయ్య, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ ముత్తయ్య, సత్యనారాయణ, కే. రాంబాబు, జంజర్ల రమేష్ బాబు, ముచ్చర్ల శ్రీను తదితరులు పాల్గున్నారు.