15-11-2023 Super
తెలంగాణ
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గజ్వేల్లో కేసీఆర్కు వ్యతిరేకంగా 114 మంది ధరణి బాధితులు నామినేషన్ వేశారని, కామారెడ్డిలో 58 మంది నామినేషన్లు దాఖలు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు.
నామినేషన్లు వెనక్కి తీసుకోవాలని పోలీసులతో వారిని కేసీఆర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇక బీజేపీ పార్టీ ఒక్కటే బీసీల గురించి ఆలోచిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ 23 మంది బీసీ నేతలకు, కాంగ్రెస్ 22 మంది బీసీలకు మాత్రమే ఎన్నికల్లో సీట్లు ఇచ్చిందని, కానీ తాము 39 మందికి టికెట్లు ఇచ్చామన్నారు.
ఈ సందర్బంగా నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డిపై జరిగిన దాడిని కిషన్ రెడ్డి ఖండించారు. బీఆర్ఎస్ నేతలు గూండాయిజం చేస్తున్నారని, బీఆర్ఎస్ గూండాలే దాడి చేశారని ఆరోపించారు.
నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని కోరుతూ శ్రీధర్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేశారని, దీంతో ఆయనపై పట్టపగలే బీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఈ దాడి ఘటనను ఈసీ దృష్టికి తీసుకెళతామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఇలా దాడులు చేయించడం సమంజసం కాదన్నారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.