17-11-2023 Srinu
ఆంధ్రప్రదేశ్
కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్.. ఖాకీ నుంచి ఖద్దరు దాకా ఆయన తీరు మారలేదు. కాంట్రవర్సీ మాటలు కొందరికి చిక్కులు తెచ్చిపెడితే ఆయనకి మాత్రం ఎంపీ స్థానాన్ని సంపాదించి పెట్టి పార్లమెంటుకు పంపాయి. ఇప్పుడు అవే మాటలు ఆయనని రాజకీయాలకు దూరం చేస్తున్నాయి.
హిందూపురం ఎంపీగా గెలుపొందిన కాంట్రవర్సీ ఎంపీ గోరంట్ల కావాలనే అలా మాట్లాడతారో లేక నిత్యం వార్తల్లో ఉండాలని వ్యాఖ్యలు చేస్తారో అర్థం కాదు.. చాలా మంది దశాబ్ధాలుగా రాజకీయాలలో ఉన్నా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ మాధవ్ మాత్రం ఎంపీ కాక ముందు నుంచే ఆయన పేరు తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తూనే ఉంది.
కర్నూలు జిల్లాకు చెందిన గోరంట్ల ఎస్ఐగా కెరీర్ ప్రారంభించారు. ఎక్కువ కాలం ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే పనిచేసి సీఐగా పదోన్నతి కూడా అందుకున్నారు. అయితే సినిమాలో పోలీసులను చూపిస్తున్న విధంగా హీరోలా ఉండాలనుకున్న ఈయన రెచ్చిపోయి మీడియాలో కనిపించేవాడు.
సీఐ నుంచి ఎంపీ దాకా.. టీడీపీ ప్రభుత్వంలో ఎంపీ దివాకర్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం.. దానికి ప్రతిగా గోరంట్ల ప్రెస్‌మీట్ లో మీసం తిప్పి సవాల్ విసరడంతో ఆయన పేరు జనంలో బాగా వినపడసాగింది. అనంతపురం జిల్లాలో సీఐగా పని చేస్తున్నప్పుడే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీ కండువా కప్పుకున్నారు.
పార్టీలోకి వచ్చీ రాగానే సీఎం జగన్ హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు. 2019లో జగన్ వేవ్ ఉండటం.. మాధవ్ కురుబ సామాజిక వర్గం కావడం.. హిందూపురంలో భారీ మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఖాకీ తీసేసి ఖద్దరు వేసినా ఆయన తీరు మాత్రం మారలేదు. పోలీస్గా ఉన్నప్పుడు ఎలా కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసేవారో ఎంపీ అయిన తరువాత కూడా అలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు.
ఆయన తీరు వైసీపీ ఎద్దలకు తలనొప్పిగా మారింది. అదే పార్టీకి చెందిన కొందరు పెద్దలు సారి గోరంట్లకు టిక్కెట్ ఇవ్వకూడదని అధిష్టానానికి తెలిపారు.