21-11-2023 Srinu
తెలంగాణ
హైదరాబాద్, నవంబర్ 21: ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసిన ఫెడరేషన్ అఫ్ తెలుగు అసోసియేషన్స్ అఫ్ మహారాష్ట్ర.
తెలంగాణాలో ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. చావో రేవో అన్నట్లుగా అభ్యర్థులు, పార్టీ నాయకులు ఆహెరాత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. హామీలు, వాగ్దానాలు, ఉచితాలతో హెరీరెత్తుస్తున్నారు. కులాలపరంగా, మతాలపరంగా, ప్రాంతాలపరంగా వోటర్లును ఆకట్టుకునేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. బొగ్గుబాయి, దుబాయి, ముంబాయి వలస బతుకుల్ని మెరుగు పరచాలన్న ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఊపిరిపోసుకుంది. ఎన్నో కలలు, మరెన్నో ఆశలతో ఏర్పడ్డ తెలంగాణాలో దుబాయి, బొగ్గుబాయి బతుకులు బాగుపడ్డాయో లేదో కానీ ముంబాయి బతుకుల్ని పట్టించుకున్న దాఖాలాలే లేవు.
వైస్సార్ హయాం నుండే తెలంగాణ నుండి ముంబాయికి వలసలు కాస్త తగ్గినా, ముంబాయిలో స్థిరపడ్డ తెలంగాణ ప్రజల బతుకుల్లో కించిత్ మాత్రం కూడా మార్పురాలేదు. గల్ఫ్ కష్టాల గురించి ప్రభత్వం పట్టించుకుంటున్నట్లుగా, చర్చలు జరుపుతున్నట్లుగా అప్పుడప్పుడు వార్తలు చదువుతుంటాం కానీ, ముంబై తెలంగాణ బతుకు వెతల గురించి ఏ నాయకుడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. ముంబై, భీవండి పరిసర ప్రాంతాల్లో దాదాపు 12 లక్షల మంది తెలంగాణవాసులున్నారు. ఇందులో దాదాపు 8 లక్షల మందికి తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులున్నాయి, కుటుంబాలున్నాయి.. రాకపోకలున్నాయి.. బంధువర్గం ఉంది. ముంబై, భీవండి నుండి ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల ఆదాయం తెలంగాణకు వస్తోంది. పెట్టుబడులు వస్తున్నాయి. సుదీర్ఘమైన సరిహద్దు ప్రాంతం ఉంది. వోట్లపరంగా చూస్తే ముంబై పరిసర ప్రాంతాల్లో స్థిరపడ్డ ఈ 8 లక్షల మంది తెలంగాణ ప్రజలు, తెలంగాణాలో ఉన్న తమ కుటుంబాల ద్వారా ఎన్నో లక్షల మందిని ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. ‘‘ముంబైవాళ్లు తెలంగాణాకు వచ్చి వోటేసేది ఉందా..? పాడా..? వాళ్ళను ఎందుకు పట్టించుకోవడం..?’’ అని తెలంగాణ పార్టీల నాయకుల అభిప్రాయం కావొచ్చు. కానీ, ముంబై తెలంగాణ ప్రజలు నాటిలాగా ఎడ్డిలోకంలో లేరు. ఇప్పుడు చైతన్యవంతులయ్యారు. వారికి వోటు విలువ తెలుసు.. పార్టీల వైఖరి కూడా తెలుసు. ఎవరికి వోటెయ్యాలి..? ఎవరికి వోటు వేయించాలో కూడా తెలుసు.
ముంబై పరిసర నగరాల తెలంగాణ ప్రజల వెతల్ని తెలంగాణా ప్రభుత్వం పట్టించుకొని, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలనీ గతంలో ఎన్నో వినతి పత్రాలు సమర్పించాం. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఈ ఎన్నికల సందర్భంగా మరోసారి తెలంగాణాలో అధికారం కోసం పోటీ చేస్తున్న అన్ని పార్టీలకు ఇక్కడి సమస్యల గురించి తెలియచెప్పాలనుకుంటున్నాం.
- రవాణా సౌకర్యం మెరుగుపరచాలి
- తెలంగాణ సాంస్కృతిక భవనం నిర్మించాలి
- ముంబై విశ్వవిద్యాలయంలో తెలుగు పీఠం ఏర్పాటు చేయాలి
- విద్యార్థులు ఎదుర్కొంటున్న నాన్ లోకల్ సమస్య తీర్చాలి
- ముంబై మిల్లు కార్మికులకు ఉపాధి కల్పించాలి
- తెలుగు సంఘాలకు ఆర్థిక సహాయం అందించాలి
- సాంస్కృతిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేయాలి
- తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు ప్రతిష్టించాలి
- రచయితలకు ప్రోత్సాహాన్నివ్వాలి
- కుల దృవీకరణ పత్రాల నియమాలను సరళీకృతం చేయాలి
ఈ సమావేశంలో ప్రెసిడెంట్ గంజి జగన్ బాబు, జనరల్ సెక్రటరీ కంటే అశోక్, వైస్ ప్రెసిడెంట్ మచ్చ సుభాష్, మీడియా కో-ఆర్డినేటర్ సంగెవేని రవీంద్ర, గూడూరు శ్రీనివాస్, మరియు కె హరీష్ పేర్కొన్నారు.