13-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
- ఎన్నికల్లో జగన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్దం
నెల్లూరు, (డిసెంబర్ 13): చంద్రబాబు అరెస్టుతోనే రాష్ట్రంలో వైసిపి పతనం ప్రారంభమైందని పార్టీ సీనియర్ నేత మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ, జనసేనలను ఎలా అరెస్ట్ చేయాలన్న ఆలోచన తప్ప రాష్ట్ర అభివృద్ధిని జగన్ విస్మరించారని మండిపడ్డారు. మరోసారి జగన్ రెడ్డిని గెలిపిస్తే సామాన్య, పేద ప్రజల బతుకులు పూర్తిగా అధోగతిపాలు అవుతాయని ఆయన పేర్కొన్నారు.
చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన విధానాన్ని, వరుసగా టీడీపీ నేతలపై కేసులను ప్రజలలోకి తీసుకువెళ్లాలని టీడీపీ శ్రేణులకు సూచించారు. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ రంగంలో ఎలాంటి అవినీతి, మచ్చలేని చంద్రబాబును అక్రమంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇరికించి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. పైపెచ్చు చంద్రబాబు అరెస్టు అయిన విషయం జగన్ రెడ్డికి తెలియదని బుకాయించడం ఆయన నిస్సిగ్గు రాజకీయానికి పరాకాష్ట అని అన్నారు.
కొరివితో తల గోక్కున్నట్లుగా చంద్రబాబుతో పెట్టుకున్న జగన్ రెడ్డిని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపి గల్లంతే అన్నారు. ఓటమి భయంతోనే పలు మార్పులకు దిగుతున్నారని అన్నారు. జగన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి అభివృద్ధిని గాలికొదిలేసి అరాచకరం, రౌడీయిజం, గుండాయిజం పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారన్నారు.
అంతటితో ఆగకుండా పేదల ఆస్తులు, స్థలాలను సైతం వదలకుండా అక్రమించుకోవడమే వైసిపి నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. వీరి దురాగతాలకు పోలీసులు, అధికారులు కూడా తానా అంటే తందానా అంటూ భజన చేయడం దారుణమన్నారు. సామాన్య, పేద ప్రజలకు అండదండా తెలుగుదేశం పార్టీ అనే సంగతి ప్రజలు గుర్తెరగాలన్నారు. దుర్మార్గపు వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న నిరసన దీక్షలకు అనూహ్య స్పందన వస్తోందని అన్నారు. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసి ఆనందం పొందుతున్న సైకో ముఖ్యమంత్రి వైఎన్ జగన్ మోహన్ రెడ్డి కుట్రపూరిత పాలనను ప్రజలు అర్థం చేసుకుని వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు ఎదురు చూస్తున్నారన్నారు.