13-12-2023 RJ
సినీ స్క్రీన్
సీనియర్ నటుడు మురళీ మోహన్ - సంగీత దర్శకుడు కీరవాణి కుటుంబాల మధ్య పెళ్లి సంబంధం కుదురుతున్నట్లు కొంత కాలంగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. కీరవాణి తనయుడు మురళీ మోహన్ మనవరాలి మధ్య ప్రేమ వివాహం జరుగుతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇందులో నిజం ఎంతన్నది క్లారిటీ లోపించింది. ఆ రెండు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి వివరణ లేకపోవడంతో ఇది రూమర్ అని అంతా భావిస్తున్నారు.
తాజాగా వాటన్నింటిపై మురళీ మోహన్ క్లారిటీ ఇచ్చేసారు. అవును రెండు కుటుంబాలు వివాహ బంధంతో బంధుత్వం కలుపుకుంటున్నట్లు ప్రకటించారు. "నాకు ఒక కుమార్తె..కుమారుడు గలరు. కుమార్తె పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తనకి ఓ పాప. ఫిబ్రవరి 14న హైదరాబాద్ లో వివాహం జరగనుంది. అలాగే నా కుమారుడుకి ఒక కుమార్తె. ఆమె పెళ్లి కూడా దాదాపు ఖాయమైంది. అందరూ ఊహించినట్లుగానే కీరవాణి ఇంట కోడలిగా వెళ్లనుంది.
పెద్ద మనవరాలి పెళ్లి ఫిబ్రవరిలో అయితే.. చిన్న మనవరాలి పెళ్లి వచ్చే ఏడాది జరగనుంది' అని తెలిపారు. దీంతో అన్నిరకాల ప్రచారాలకు పుల్ స్టాప్ పడినట్లు అయింది. మురళీ మోహన్ కుమారుడు పేరు రామ్మోహన్. ఆయన కుమార్తె పేరు రాగ. బిజినెన్ లో మాస్టర్స్ పూర్తిచేసింది. ప్రస్తుతం సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు.
ఆమెనే శ్రీసింహ వివాహమాడుతున్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఇప్పటికే ఇది ప్రేమ వివాహంగా ప్రచారంలోకి వచ్చింది. శ్రీ సింహ టాలీవుడ్ లో హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. 'యమ దొంగ'తో చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తెల్లవారితో గురువారం'.. 'దొంగలున్నారు జాగ్రత్త.. 'ఉస్తాద్' సినిమాల్లో నటించాడు.