15-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్15): పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తులు ఉండవని స్పష్టం చేశారు. జనసేనతో ఇక పొత్తులు లేవని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో పొత్తులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ముఖ్యనేతలు జిల్లా అధ్యక్షులు, ఇంచార్జ్ లు, పార్లమెంట్ ప్రబారీలు తదితరలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని బీజేపీ నేతలు, క్యాడర్ కు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నట్లు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఉండవని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పొత్తు.. అన్నది కేవలం ప్రచారం మాత్రమే అని కొట్టిపారేశారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తోందని తేల్చిచెప్పేశారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సమాన పోరాటాలుంటాయన్నారు. లోక్ సభలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశముందని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలకు క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సర్వే సంస్థలకు కూడా అందని విధంగా లోక్సభ ఫలితాలుంటాయన్నారు. శనివారం నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్ళాలని కేడర్క సూచించారు. కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారన్నారు.
తెలంగాణలో మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి అన్ని కమిటీల నియామకాలు పూర్తి చేయాలని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే పొత్తులపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు జనసేన వర్గాల్లోనూ చర్చనీయాంసం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని అనుకోలేదు. తన పార్టీ తరపున 32స్థానాల్లో పోటీ చేయాలని అనుకున్నారు. కానీ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ రాయబారం చేసుకుని .. జనసేనకు ఎనిమిది సీట్లు ఇచ్చి పొత్తులు పెట్టుకున్నారు.
అయితే తెలంగాణలో జనసేన ఎక్కడా ప్రభావం చూపలేదు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో కలిసి పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందనుకుని పొత్తు పెట్టుకున్న బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు వల్ల ఇరు పార్టీలకు మేలు జరగలేదు. జనసేన పార్టీ పోటీ చేసిన ఎనిమిది చోట్లా బీజేపీ కార్యకర్తలు జనసేనకు మద్దతు ఇవ్వలేదని ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.
సంప్రదాయంగా బీజేపీ ఓటు బ్యాంక్ కూడా జనసేనకు అనుకూలంగా రాలేదు. తాండూరులాంటి చోట్ల గతంలో బీజేపీకి పది వేల ఓట్లు వచ్చాయి. ఆ ఓటు బ్యాంక్ బదిలీ కాలేదు. కూకట్ పల్లిలోనూ అంతేనన్న విశ్లేషణలు వచ్చాయి. ఈ కారణంగానే జనసేనతో పొత్తు విషయంపై కిషన్ రెడ్డి ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇప్పటికే ఏపీలో బీజేపీతో కలిసి ఉన్నామని చెబుతూంటారు కానీ.. ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నారు.
ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల సమయంలో ఏర్పడిన పొత్తు ఏపీకి కూడా వస్తుందని పవన్ మనసు మార్చుకుని బీజేపీతో కలిసి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ తెలంగాణలో జనసేనను దూరం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించుకోవడంతో ఏపీలో కూడా ఇక బీజేపీతో కలిసే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది. ఎన్డీఏ నంచి బయటకు రాలేదు. కానీ పొత్తుల గురించి జాతీయ పార్టీ నిర్ణయిస్తుందని కిషన్ రెడ్డి ప్రకటన కాదని జనసేన వర్గాలు చెబుతున్నాయి.
కానీ పొత్తుల వల్ల పరస్పర ఉపయోగం ఉంటేనే... బీజేపీ హైకమాండ్ అంగీకరిస్తందని. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రయోజనం కలగనందున జనసేన పార్టీకి సీట్లు కేటాయించే అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం ఉన్నందున ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయలేమని.. ఎన్నికలకు ముందే కలిసి పని చేస్తామా లేదా అన్నదానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.