15-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్15): ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల గురించి సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు నిర్దేశిత సమయం కంటే 15 నుంచి 20 రోజుల ముందుగానే జరుగుతాయని అన్నారు.
శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం జగన్ మంత్రులతో ఈ వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. కాబట్టి, ఎన్నికలకు అందరూ పూర్తిగా రెడీగా ఉండాలని అన్నట్లు తెలిసింది. మన పార్టీ ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉందని, అయినప్పటికీ మంత్రులు క్షేత్ర స్థాయిలో మరింత సమర్థంగా పని చేయాలని సీఎం నిర్దేశించారు.
గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావొచ్చని సీఎం అన్నారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని.. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో వ్యాఖ్యానించారు.
అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు.. వాటికి కొమ్ము కాస్తున్న మీడియా సంస్థలు చేసే విష ప్రచారాలను తేలికగా తీసుకోవద్దని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈనాడు, యెల్లో మీడియాలో జరిగే ప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఇకపోతే ఫిబ్రవరి నెలలో పార్లమెంట్ ఎన్నికలు జరగవచ్చునన్న ఊహగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికలు ఫిబ్రవరి నెలలో ఉండవచ్చునని తమ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చిన నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.