15-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 15): రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ముందుగా నీటి ఎద్దడి గ్రామాలను గుర్తించి అందుకు తగ్గట్లుగా ప్రణాలిక ఉండాన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని తాగునీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజు నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు.
మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల పై చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లతో మంత్రి సీతక్క శుక్రవారం సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు సమగ్రంగా ఈ సమీక్షాసమావేశం జరిగింది. మిషన్ భగీరథ శాఖ కార్యకలాపాల గురించి ఆ శాఖ ముఖ్యకార్యదర్శి స్మితా సభర్వాల్ మంత్రికి సమగ్రంగా వివరించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్లు, నదులు తదితర నీటి వనరుల స్థాయులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.
రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని.. ఇరిగేషన్ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మేడారం జాతరపై త్వరలోనే లైన్ డిపార్ట్మెంట్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు.