15-12-2023 RJ
తెలంగాణ
కరీంనగర్, (డిసెంబర్15): అసెంబ్లీ ఎన్నికల ఓటమితో కుంగిపోవద్దని, భవిష్యత్ మనదేనని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వచ్చే అన్ని ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనరంజకంగా పాలన సాగించినప్పటికీ కొద్ది తేడాతో ఓడిపోయామని అన్నారు.
ప్రజా క్షేత్రంలోకి వెళ్లి స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటుతూ ముందుకు సాగుదామని వినోద్ కుమార్ అన్నారు. చొప్పదండి నియోజకవర్గం పరిధిలోని రామడుగు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వినోద్ కుమార్ హాజరై మాట్లాడారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి గల కారణాలను కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. పాలనలో జరిగిన చిన్న చిన్న లోపాలతోనే పార్టీ ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. లోపాలను సరిచేసుకొని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేలా నాయకులు, కార్యకర్తలు సమాయత్తం కావాలని వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనలో దేశంలోనే రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, ఆదాయ వనరులను మెరుగుపరచుకోవడంలో దేశంలోనే రాష్ట్రం రెండో స్థానంలో ఉందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దని, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాడుదామన్నారు.