16-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్16): మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. లారీలో నర్సరీ మొక్కలు చాటున గంజాయిని తరలిస్తున్న ముఠాను బాలానగర్ ఎస్వోటీ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు డీసీఎంలో నర్సరీ మొక్కల చాటున గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో.. షాపూర్ నగర్ సబ్ స్టేషన్ దగ్గర గంజాయిని తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లారీలో ప్యాకెట్లలలో ప్యాక్ చేసిన 400 కేజీల ఎండు గంజాయి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం లారీని, రెండు సెల్ ఫోన్స్, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న ఎస్వోటీ పోలీసులు.. జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న జీడిమెట్ల పోలీసుల విచారణలో నిందితులు ఒరిస్సాకు చెందిన బబ్లూ ఆలియాస్ కృష్ణ (23), మహరాష్ట్రకు చెందిన గోవింద్ పటిదార్(42) వీరు డ్రైవర్, క్లీనర్ గా చెలామని అవుతున్న గంజాయి స్మగ్లర్లుగా గుర్తించారు.
వీరు రాజమండ్రి నుండి గంజాయిని లారీలో లోడ్ చేసి పైన నర్సరీ మొక్కలను ఉంచి మహరాష్ట్రకు గంజాయిని సరఫరా చేసి అక్కడ అరవింద్, బబ్లూకు అందచేస్తున్నట్లు నిందితుల విచారణలో తేలింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 1 కోటి రూపాయలు వరకు ఉంటుందని.. నిందితులను రిమాండుకు తరలిస్తున్నట్లు బాలనగర్ డీసీపీ శ్రీనివాస రావు అన్నారు.