18-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, (డిసెంబర్18): లోకేశ్ పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంది. భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో చేపట్టిన.. వస్తున్న మీకోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం జిల్లా పోల్లపల్లిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. సీఎం జగన్ పాలనలో బాధితులుగా మారిన రాష్ట్ర ప్రజలకు తానున్నానన్న భరోసా కల్పించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అనూహ్య స్పందన లభించింది.
ప్రజాగళమై సాగిన ఈ యాత్ర.. ఈ ఏడాది జనవరి 27న కుప్పం శ్రీవరదరాజస్వామి పాదాల వద్ద ప్రారంభమై..ప్రజా చైతన్యమే ధ్యేయంగా ముందుకు సాగింది. 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, మున్సిపాలిటీ లు, 2,028 గ్రామాల మీదగా పాదయాత్ర కొనసాగింది. 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యవగళం పాదయాత్ర సాగింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన కుప్పం శ్రీ వరదరాజుస్వామి పాదాల చెంత వద్ద లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. అనివార్యమైన సందర్భాల్లో మినహా యవగళం పాదయాత్రకు ఏనాడూ విరామం ప్రకటించలేదు.
సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టుతో పోదలాడ వద్ద పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చారు. ప్రతి జిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన వచ్చింది. పాదయాత్రలో లోకేష్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం జీవో నంబర్ 1 సాకుతో లోకేష్ ప్రచార రథం నిలబడ్డ స్టూల్ వరకు లాగేసి గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. యువగళం వాలంటీర్లు 40 మందిపై కేసు నమోదు చేయడంతో జైలుకు వెళ్లారు.
ప్రతి వంద కిలోమీటర్లకు ఒక హామీల తో కూడిన శిలాఫలకం ఏర్పాటు చేశారు. 97 అసెంబ్లీ నియోజకవర్గంల్లో 70 చోట్ల లోకేష్ బహిరంగ సభలు నిర్వహించారు. దాదాపు మూడున్నర లక్షల మందికిపైగా అభిమానులతో లోకేష్ సెల్ఫీ దిగారు. ఒకేరోజు 2500 మందితో సెల్ఫీలు దిగిన కారణంగా తీవ్రమైన చెయ్యి నొప్పితో బాధపడ్డారు. పెనమలూరు నియోజక వర్గంలో 13 గంటలపాటు ఏకధాటిగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది.
అడుగడుగునా అభద్రతాభావం, నిరాశానిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు తానున్నానన్న ధైర్యం ఇచ్చారు. మొత్తంగా ఈ కాలంలో 70 బహిరంగసభలు, 155 ముఖాముఖి సమావేశాలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, ఎనిమిది రచ్చబండలు నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలనుంచి రాతపూర్వకంగా 4,353 వినతిపత్రాలు అందు కున్నారు. వివిధ సామాజికవర్గాలు, వృత్తులవారు నేరుగా లోకేశ్ను కలుసుకుని కష్టాలు చెప్పుకున్నారు.
సుదీర్ఘ పాదయాత్రలో కోటిన్నర మంది ప్రజలతో ఆయన మమేకమయ్యారు. పాదయాత్ర చిత్తూరు జిల్లా దాటకముందే రాష్ట్రంలోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి మోగించడంతో టిడిపి శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. గతంలో ఏ పార్టీ నాయకుడూ చేయని విధంగా రాయలసీమలోనే లోకేశ్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఏకంగా 124 రోజులపాటు 44 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,587 కిలోమీటర్లు నడిచారు. రాయలసీమ వాసులు బ్రహ్మరథం పట్టారు. ఉభయ గోదావరి జిల్లాల్లో సాగిన పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. 17 నియోజకవర్గాల పరిధిలో 23 రోజులపాటు సాగిన యాత్ర జనజాతరను తలపించింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో 11 రోజులపాటు 225.5 కిలోమీటర్లు సాగగా.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 12 రోజుల పాటు 178.5 కిలోమీటర్లు సాగింది. ఉత్తరాంధ్రలోనూ పాదయాత్రకు ఊహించని స్పందన లభించింది. నిజానికి ఈ యాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు నిర్వహించి, అక్కడ ముగింపు సభ ఏర్పాటుచేయాలని భావించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఏడు రోజులపాటు 113 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. పాదయాత్ర వెంబడి తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు అధికార యంత్రాంగానికి లోకేశ్ 600కు పైగా లేఖలు రాశారు.