18-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
కడప, (డిసెంబర్ 18): వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. వివేకా కుమార్తె సునీత రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలపై పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.
పులివెందుల కోర్టు ఆదేశాల మేరకు.. అలాగే వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో కొందరు తనను బెదిరిస్తున్నారని ఆయన పీఏ కృష్ణారెడ్డి గతంలో పులివెందుల కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అధికారులు కొందరి నేతలపేర్లు చెప్పాలని తనను బెదిరిస్తున్నట్లుగా కోర్టు దృష్టికి తెచ్చారు.
వివేకా హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. సీబీఐ ఎస్పీ రాంసింగ్ బెదిరింపులకు పాల్పడ్డారని పిటిషన్ లో వివరించారు. సీబీఐ అధికారులకు అనుకూలంగా వ్యవహరించాలని వివేకా కుమార్తె, అల్లుడు కూడా తనను బెదిరించారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని అప్పట్లో ఎస్పీగా ఉన్న అన్బురాజన్ ను కలిసి వినతిపత్రం అందజేశానని వివరించారు.
రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా ఫలితం లేకపోవడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు, కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారించి వివేకా కుమార్తె, అల్లుడు, సీబీఐ ఎస్పీలపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈనెల 15వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరిలో పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా ఎస్పీ రామ్ సింగ్ వేధించారని, సునీత, రాజశేఖర్ రెడ్డి కూడా సీబీఐ చెప్పినట్లు నడుచుకోవాలని తనను బెదిరించినట్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన పులివెందుల కోర్టు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు ఈ ముగ్గురుపై కేసు నమోదు చేశారు.