18-12-2023 RJ
సినీ స్క్రీన్
తెలుగులో వైవిధ్యమైన నటులు ప్రస్తుతం ఎవరైనా వున్నారు అంటే అది ఒక్క రావు రమేష్ మాత్రమే అని చెప్పొచ్చు. కామెడీ, సీరియస్, భావోద్వేగాలు ఎటువంటివైనా తనకి తానే సాటి అనిపించుకున్న రావు రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతుడైన నటుడు. తండ్రికి తగ్గ తనయుడిగా, తనదైన శైలిలో డైలాగ్ లు చెపుతూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అందుకనే రావు రమేష్ ఎంపిక చేసుకునే పాత్రలు చూస్తే అవన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా అన్నీ వెరైటీగా ఉంటాయి.
ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే అతను నటించే సినిమా ఫలితం ఎలా వున్నా రావు రమేష్ పాత్రలు ఎప్పుడూ ఫెయిల్ అవలేదు, అవి ఎప్పుడూ హిట్ అవుతూ వచ్చాయి. అటువంటి నటుడు ఇప్పుడు ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. టైటిల్ పాత్రలో 'మారుతినగర్ సుబ్రమణ్యం అనే సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుందని తెలిసింది. ఇందులో అతను ప్రధాన పాత్రలో కనపడతారని, సినిమా నేపధ్యం అంతా అతని పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుందని తెలిసింది.
అతనికి జోడీగా ఇంద్రజ ఒక కీలక పాత్రలో నటిస్తోంది. 'హ్యాపీ వెడ్డింగ్' ఫేమ్ లక్షణ్ కార్య ఈ చిత్రానికి దర్శకుడు. సినిమా అంతా వినోదాత్మకంగా వుండే ఈ సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తి అయిందని చిత్ర నిర్వాహకులు ఒక ప్రకటనలో చెప్పారు. 'రావు రమేష్ గారిని ఇప్పటి వరకు చాలా సినిమాలో వివిధ పాత్రలో చూసిన ప్రేక్షకులకి, ఈ సినిమాలో ఒక వినోదాత్మకమైన పాత్రలో ప్రేక్షకులు మెచ్చే విధంగా కనిపిస్తారు. అన్ని సినిమాల్లో అతని డైలాగులు ఎలా పాపులర్ అయ్యాయో, ఈ సినిమాలో కూడా అతని డైలాగ్స్ బాగా పాపులర్ అవుతాయని అనుకుంటున్నాను.
ఇక చిత్రీకరణ పరంగా ఆయన మాకు ఎంతో సహాయం చేశారు. బిజీగా ఉన్నప్పటికీ, మా సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించి సినిమా పూర్తి కావడానికి ఎంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమాపై, అతను చేస్తున్న పాత్ర మీద ఆయనకు అంత నమ్మకం, ప్రేమ ఉన్నాయి. ఈ సినిమా పూర్తి వినోదాన్ని పండిస్తుంది, ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తారని దర్శకుడు లక్ష్మణ్ కార్య చెప్పారు.