19-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్19): కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎక్కడిక్కడ తనిఖీలు నిర్వహిస్తూ డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలుచోట్ల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. తాజాగా నగరంలో టీఎస్ఎస్ఏబీ ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్లో ఏపీకి చెందిన భీమవరం, నెల్లూరు డ్రగ్స్ ముఠాలను అదుపులోకి తీసుకున్నారు.
గడిచిన 24 గంటల్లో నగరంలో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు. ఎస్ఆర్ నగర్, చైతన్యపురి, ఫిలింనగర్లో పలు ముఠాలను అరెస్ట్ చేశారు. న్యూ ఇయర్ వేడుకలే టార్గెట్ డ్రగ్స్ సరఫరా జరుగుతున్న నేపథ్యంలో మూడు పోలీస్ కమిషనరేట్ పోలీసులు మరింతగా అప్రమత్తమయ్యారు. టీ న్యాబ్ పోలీస్, హైదరాబాద్ టాస్క్ ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు రంగంలోకి దిగి డ్రగ్స్ సరఫరాపై మరింత దృష్టి సారించారు. ప్రధానంగా పబ్బులు, బార్లపై దృష్టి కేంద్రీకరించారు. ఎక్కడెక్కడ ఇది సరఫరా అవుతందో గుర్తించే పనిలో పడ్డారు.