19-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
నెల్లూరు, (డిసెంబర్19): గతంలో బీహార్ అరాచకాల పరిస్థితులు ఇప్పుడు ఏపీలో నెలకొన్నాయని తీవ్రస్థాయిలో టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. అరచకాలకు ఏపీ నెలవుగా మారిందని జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింద ని దాడులతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాబోతుంది, ఖచ్చితంగా మేము అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి మైనింగ్ మాఫియా చేస్తున్నారు. నేను నాలుగు రోజులుగా ప్రశాంతంగా దీక్ష చేస్తుంటే, పోలీసులు దోపిడీ దొంగల్లా నన్ను తీసుకెళ్లడం దారుణం. హిజ్రాలకు డబ్బులు ఇచ్చినా మీద దాడి చేయించాలని చూశారు. మీరని తెలియక వచ్చామని నన్ను దీవించి వెళ్ళారు. దేశంలోనే అతి పెద్ద కుంభకోణాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సిలికా, తెల్లరాయి కుంభకోణాలు నిలిచాయన్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భారీగా ఖనిజ సంపదని దోచేస్తున్న మాఫియాను అధికారులు అడ్డుకోవడం లేదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రి నియోజక వర్గంలో వరదాపురం వద్ద రుస్థం మైన్లో అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. భారీ యంత్రాలు, పేలుడు పదార్థాలు రెడ్ హ్యాండెడ్గా పట్టించాం. పేలుడు పదార్థాలు, డ్రిల్లింగ్ మిషన్ల ఆధారాలు చూపినా అధికారులు పట్టించుకోడం లేదు. మేము మైన్ దగ్గర చూపించిన పేలుడు పదార్థాలను, నేనే అక్కడ పెట్టానని తప్పుడు కేసులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సోమిరెడ్డి అన్నారు.
జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ జరుగుతుంటే.. ఈ జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి నెలా మొదటి వారంలో సీఎం జగన్, మరికొంత మందికి ఇక్కడ సామంతులు ద్వారా భారీగా డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. ఇదిలావుంటే నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి పొలిటికల్ హైడ్రామా నడిచింది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి దాటాక 2 గంటల సమయంలో ఆయన దీక్ష చేస్తున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఆయన్ను దీక్షా శిబిరం నుంచి తరలించారు. ఇంటి వద్ద దించి వెళ్లిపోయారు.
సోమిరెడ్డి దీక్ష భగ్నం కోసం పోలీసులు రావడంతో ఆయన అభిమానులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు అక్కడ హడావిడి జరిగింది. చివరకు పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు వచ్చి సోమిరెడ్డిని తరలించారు. ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ మండిపడింది. ఆ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ఘాటు ట్వీట్ వేశారు. 'కాకాణిని అడ్డు పెట్టుకుని, జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ చేస్తున్న మైనింగ్ మాఫియాపై మూడు రోజులుగా పోరాడుతున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పై పోలీసుల జులం.
తెల్లారి మైన్లను పరిశీలిస్తామని కలెక్టర్ చెప్పటంతో, రాత్రికి రాత్రి పోలీసులని దింపి, నిరసనను భగ్నం చేసి, మైన్ లో ఉన్న 14 భారీ ప్రొక్లెయిన్లు, 15 డంపర్లతో పాటు అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్ధాలను అక్కడి నుంచి తరలించేసిన జగన్ ముఠా.' అంటూ టీడీపీ వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.