19-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, (డిసెంబర్19): ఏపీలో నాసి రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని మరోమారు ముఖ్యమంత్రి జగన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శలు గుప్పించారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేకుండా పోయిందని కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో అనేక ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టారని.. భూములను వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు.
ఎంపీ విజయసాయి రెడ్డి కుమార్తెకు అప్పనంగా భూములు కట్టబెట్టారన్నారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా ప్రజలను జగన్ ప్రభుత్వం వంచిస్తోందన్నారు. టిడ్కో లబ్దిదారులకు ఇళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. అన్ని పథకాలకు జగన్ బొమ్మలు వేస్తున్నారని.. జగన్ ప్రభుత్వాన్ని స్టిక్కర్ ప్రభుత్వంగా పిలుస్తామని ఎద్దేవా చేశారు. రుషికొండలో పర్యావరణ ఉల్లంఘన జరిగిందని.. ఈ కొండను బొడి గుండు కొట్టేశారన్నారు. కోడి గుడ్డుల మీద కూడా ఆఖరికి జగన్ బొమ్మలు వేస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు భారీగా నమోదు చేస్తున్నారన్నారు. రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్నారు.
మెట్రో రైలు డీపీఆర్ ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఈఎస్సీ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే భూమి ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను పూర్తిగా దిగజార్చారని... అనేక ఐటీ పరిశ్రమలు విశాఖ వదిలి వెళ్ళిపోయాయన్నారు. యువతలో డ్రగ్ కల్చర్ పెరిగిపోతుండటం బాధాకరమన్నారు. విశాఖ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. ఎన్నో కేంద్ర సంస్థలు విశాఖకు రావడం అంతా బీజేపీ చలువే అని చెప్పుకొచ్చారు. మోదీ దూర దృష్టి కారణంగానే భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పురందేశ్వరి పేర్కొన్నారు.