19-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
తిరుమల, (డిసెంబర్ 19): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, యెల్లో మీడియాపై మంత్రి ఆర్ కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని.
జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా.. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా అని అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యని చెప్పారు.. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. అయితే రాష్ట్రంలో ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని రోజా అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు.
పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక.. రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. ఈ క్రమంలో తనపై ప్రతిపక్షాలు అసత్యప్రచారం చేస్తున్నాయని పర్యాటక మంత్రి రోజా మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు రాదని ప్రచారం చేస్తున్నారని ఆమె చెబుతూ, సీటు రాకపోయినా తాను జగనన్న సైనికురాలినేనని స్పష్టం చేశారు. తాను ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంటున్నాననీ, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.