19-12-2023 RJ
సినీ స్క్రీన్
జాంబీరెడ్డి సినిమా తర్వాత తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం హనుమాన్ విజువల్ వండర్ గా ఉండనుంది. ఈ మూవీ విజువల్స్ బట్టి ఇది అర్థం అవుతోంది. ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్, పాన్ వరల్డ్ సూపర్ హీరో సినిమాగా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలవగా అద్భుతమైన స్పందన వచ్చింది.
ఇందులోని విజువల్స్, గ్రాఫిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయి జాతీయ స్థాయిలో సినిమాపై హైప్ వచ్చింది. అదేవిధంగా ఇప్పటివరకు రిలీజ్ చేసిన మూడు పాటలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంది. ఇంతవరకు మనం ఏ చిత్రంలో చూడని విధంగా అద్భుతమైన గ్రాఫిక్స్, విజువల్స్ మెస్మరైజ్ చేశారు.
అదేవిధంగా విలన్ పాత్రధారిని కూడా హాలీవుడ్ సూపర్ హీరోస్ స్థాయిలో మేకోవర్ చేయించిన విధానం, తమ్ముడి కోసం అక్క వరలక్ష్మి అడ్డు నిలవడం వంటి కొన్ని ఆసక్తికర సన్నివేశాలతో సినిమాపై హైప్స్ భారీగా పెరిగేలా చేశారు. సంక్రాంతికి విడుదల అవుతున్న 6 పెద్ద సినిమాలతో పోటీగా వస్తున్న ఈ హనుమాన్ చిత్రమే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ట్రైలర్ ను చూస్తూంటేనే అర్థమవుతుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఇటీవలే ప్రారంభించగా మంగళవారం ఉదయం 3 నిమిషాల 28 సెకండ్స్ నిడివితో థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
తేజ సజ్జా సరసన అమృత అయ్యర్ కథానాయికగా, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్ గా చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ త్రయం సంగీతం అందించారు. ప్రైమ్ ఎంటర్టైన్మెంట్పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హను-మాన్ సినిమాను జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేస్తున్నారు.
ఇప్పుడు ఈ వార్తే మన దేశ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే విడుదలైన టీజర్,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ డైలాగ్స్.. అద్భుతమైన విజువల్స్ ట్రైలర్ అదిరిపోయింది. క్వాలిటీ విషయంలో ప్రశాంత్ వర్మ ఎక్కడా రాజీ పడనట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 'యతో ధర్మ స్తతో హనుమ.. యతో హనుమ..స్తతో జయ’అనే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది.
పల్లెటూరిలో ఉండే హీరోకి ఒక స్పెషల్ పవర్ ఉండడం.. విలన్ (వినయ్ రాయ్) ఆ పవర్ కోసం ప్రయోగాలు చేయడం.. హీరో గురించి తెలిసి అతన్ని చంపేందుకు ప్రయత్నిస్తే హనుమంతుడు ఎలా కాపాడాడు? అసలు హీరోకి ఉన్న స్పెషల్ పవర్ ఏంటి? మామూలు వ్యక్తికి ఆ పవర్స్ ఎలా వచ్చాయి? రాక్షససంహారం చేయడానికి హనుమంతుడు ఏం చేశాడు? అనేది ఈ సినిమా కథ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. 'పోలేరమ్మ మీద ఒట్టు.. నా తమ్ముడి మీద చేతులు పడితే ఒక్కొక్కరికి టెంకాయలు పగిలిపోతాయి' అని వరలక్ష్మీ శరత్ కుమార్ సీన్ ట్రైలర్ కి స్పెషల్ అట్రాక్షన్. 'నీకు కనబడుతుంది ఒకడి ఉన్మాదం మాత్రమే కానీ దాని వెనుక ఒక ఉపద్రవం దాగి ఉంది’, 'కలియుగంలో ధర్మం కోసం పోరాటే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు.. నీ వెంటా ఉన్నాడు.. మానవాళి మనుగడను కాపాడుకోవడం కోసం నీ రాక అనివార్యం హనుమా' లాంటి డైగాల్స్ తో ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది.