19-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 19): ఆరోగ్య శాఖా మంత్రి దామోదర్ రాజనర్సింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలమయ్యాయి. మంగళవారం మంత్రి దామోదర రాజనర్సింహతో జూనియర్ డాక్టర్లు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతి నెల 15వ తేదీ వరకు స్టైఫండ్ విడుదల చేస్తామని జూడలకు మంత్రి హామీ ఇచ్చారు. జూడాల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి హామీతో సమ్మెకు వెళ్లబోమని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేశారు.
రెండు నెలల్లో నూతన ఉస్మానియా ఆస్పత్రి భవనంకు శంకుస్థాపన చేస్తాం అని ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని సమావేశం అనంతరం జూడాలు మీడియాకు తెలిపారు. పెరిగిన సీట్లకు అనుగుణంగా హాస్టల్ సదుపాయం కలిపిస్తామని అన్నారన్నారు. స్టేట్ వైడ్ గా డీఎన్బీ 46 మంది ఉన్నారని.. వారికి స్టైఫండ్ ఇస్తామని హామీ ఇచ్చారని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు.