19-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 19): తెలంగాణ ప్రభుత్వ హయాంలో నే సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని మాజీమంత్రి, సనత్ నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్ పల్లి లోని తన నివాసం వద్ద మహంకాళి అమ్మవారి 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
అదేవిధంగా ఆలయానికి రెండు వైపులా నిర్మించిన భారీ ఆర్చీలు ప్రత్యేక ఆకర్షణగా మారాయని తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ మనోహర్ రెడ్డి, చైర్మన్ సూరిటి, సభ్యులు దుబాయ్ శ్రీనివాస్, బచ్చు మహేష్, కిషోర్ కుమార్, మానిక్ యాదవ్, రాంమోహన్, మహేందర్, అరుణ్ భట్ తదితరులు పాల్గొన్నారు.