20-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయనగరం, (డిసెంబర్ 20): ఆంధ్రప్రదేశ్ లో వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన 'యువగళం - నవశకం'.. సభలో ఆయన మాట్లాడుతూ.. జగన్ రెడ్డి పాలనలో ఏపీ సర్వనాశనమైందన్నారు. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని అంటూ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదు. వచ్చేది టీడీపీ - జనసేన ప్రభుత్వమే. లోకేశ్ మాటల పాదయాత్ర కాదు.. చేతలు చూపే పాదయాత్ర. ప్రజల సమస్యలు వింటూ లోకేశ్ పాదయాత్ర చేశారు. నాకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు బాధగా ఉంది. లోకేశ్ చేసింది జగన్ లాంటి పాదయాత్ర కాదు. దశాబ్ద కాలం పాటు పార్టీని నడపాలంటే ఎంతో ధైర్యం ఉండాలన్నారు.
ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లిని విలువ ఇవ్వనివాడు మనకు ఎందుకు ఇస్తాడని అన్నారు. వైపీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తారా?. మా కార్యకర్తలపై దాడులు చేయిస్తారా?. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారు.
వారాహి యాత్రలో నాపై దాడులు చేశారు. ఏపీ భవిష్యత్ నిర్మాణానికి పొత్తు ఉండాలి. ఏపీ భవిష్యత్తు నిలదొక్కుకునే వరకు పొత్తు ఉండాలి. టీడీపీ - జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం. టీడీపీతో సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందిస్తాం. భవిష్యత్తు సభలో కార్యాచరణను విడుదల చేస్తాం. టీడీపీ - జనసేన మైత్రికి బీజేపీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.