21-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 21): దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం హెచ్చరికలు జారీచేసింది. తగు చర్యలు తీసుకోవాలని కోరింది. రాష్ట్రాలకు సాయం చేచేందుకు కేంద్రం సంసిద్ధంగా ఉందని తెలిపింది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం నాలుగు కేసులు నమోదుకాగా, బుధవారం కొత్తగా ఆరు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఇవన్నీ హైదరాబాద్లోనే నమోదయ్యాయి. ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 14 కేసులు వెలుగు చూశాయి. ఇందులో 13 కేసులు హైదరాబాద్లో రాగా, ఒకటి కరీనంగర్లో నమోదైంది.
వారందరూ ఇండ్లలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్ప టివరకు మరణాలు నమోదు కాలేదని, ఒకరు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. జేఎన్-1 వేరియంట్ తో కొవిడ్ ముప్పు ముంచుకొస్తున్న నేపథ్యంలో.. వైద్యశాఖకు సవాల్గా మారనున్నది. వైద్యారోగ్య శాఖలో మంత్రి మొదలు కీలక పదవులన్నింటిలో కొత్తవారే కొలువుదీరారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పడగా, మంత్రి దామోదర రాజనర్సింహా ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.
గతంలో కౌవిడ్ సమయంలో పనిచేసిన అధికారులెవరూ ఇప్పుడు అందుబాటులో లేరు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలు జారీ చేశారు. వరుసగా ఆయన వైద్యాశాఖాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. తాజా పరిస్థితిలపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు, చికిత్స పరికరాలు, ఔషధాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎకడైనా కొరత ఉంటే టీఎస్ఎంఎస్ఐడీసీ నుంచి సమకూర్చుకోవాలని చెప్పారు. మాక్ డ్రిల్ను వెంటనే పూర్తిచేయాలని, దవాఖానల సన్నద్ధతకు సంబంధించిన వివరాలను కేంద్రానికి పంపాలని ఆదేశించారు. ఇన్ఫ్లుయెంజా మాదిరిగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దవాఖానలు, జిల్లా స్థాయిలో విభాగాధిపతులు జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం విధిగా నమూనాలను ఉప్పల్లోని సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింట్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ (సీడీఎఫ్)కు పంపాలని తెలిపారు. శనివారం మరోసారి సమీక్ష నిర్వహిస్తానని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తొమ్మిది యాక్టివ్ కేసులు ఉన్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహకు అధికారులు తెలిపారు. బాధితుల్లో ఎవరికీ తీవ్రమైన లక్షణాలు లేవని, వారంతా ఇంట్లోనే ఐసోలేషన్లో కోలుకొంటున్నారని చెప్పారు.
బుధవారం 319 కొవిడ్ పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి పాజిటివ్ గా తేలిందని చెప్పారు. అంతకుముందు.. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మనస్సుఖ్ మండవీయ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కొత్త వెరియంట్ జేఎన్-1 మహమ్మారి కట్టడికి ముందస్తు చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు.