21-12-2023 RJ
సినీ స్క్రీన్
రెండు వరస హిట్స్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు మూడో సినిమా 'డంకీ'తో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. దీనికి రాజ్ కుమార్ హిరాణి దర్శకుడు, అతను ఇంతకు ముందు 'మున్నాభాయ్', 'లగే రహే మున్నాభాయ్', '3 ఇడియట్స్', 'పీకే', 'సంజు' లాంటి చాలా గొప్ప గొప్ప సినిమాలు చేశారు. ఇప్పుడు ఈ 'డంకీ' సినిమా కి దర్శకత్వం చేశారు.
పంజాబ్ లోని ఒక ఊరులో నలుగురు స్నేహితులు, ఇంగ్లాండ్ వెళ్లాలని కలలు కంటారు. మను (తాప్సి), సుఖీ సింగ్ (విక్కీ కౌశల్), బగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి (అనిల్ గ్రోవర్) నలుగురూ ఇంగ్లాండ్ వెళ్లాలని అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర వీసాలు లేవు, టికెట్స్ కొనడానికి డబ్బులు కూడా లేవు ఇంగ్లీష్ రాదు. ఆ సమయంలో హార్డీ సింగ్ (షారుఖ్ ఖాన్) అనే ఒక సైనికుడు తన ప్రాణాలు కాపాడిన వ్యక్తిని వెతుకుతూ ఆ గ్రామం వస్తాడు, ఆ వ్యక్తి మనుకి అన్న అని తెలుసుకొని, ఇక ఈ నలుగురినీ ఇంగ్లాండ్ పంపించే బాధ్యత తన మీద వేసుకుంటాడు. అదే ఊరులో ఇంగ్లీష్ నేర్పే వ్యక్తి బొమ్మన్ ఇరానీ దగ్గర అందరూ క్లాసుకు వెళతారు. కానీ వీళ్ళకి సరిగా ఇంగ్లీష్ రాకపోవటంతో ఇంగ్లాండ్ కి వెళ్ళడానికి వీసాలు రావు.
అప్పుడు హార్డీ సింగ్ ఏమి చేసాడు, ఎలా వీళ్ళని ఇంగ్లాండ్ తీసుకెళ్లాడు. అక్కడ వీళ్ళకి ఎటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. చివరికి అందరూ మళ్ళీ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారన్నదే 'డంకి' సినిమా కథ. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణి తనదైన శైలిలో వినోదాత్మకం తో కూడిన భావోద్వేగాలు బాగా చూపిస్తారు. బాలీవుడ్ లో దర్శకుడిగా అతను చేసినవి ఈ 'డంకి’తో కేవలం ఆరు సినిమాలే అయినా వాటి తాలూకా ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది.
ఇప్పుడు ఈ 'డంకి' లో 95 దశకంలో పంజాబ్ కి చెందిన ఒక వూరు నుండి నలుగురు కుర్రాళ్ళు డబ్బు సంపాదించి, తమ జీవితాలు బాగుపడాలని అందుకోసం లండన్ వెళ్లాలని కలలు కంటారు. కానీ దానికి వీసా కావాలి, ఇంగ్లీష్ తెలియాలి, కొన్ని పరీక్షలు రాయాలి ఇలా చాలా దాటుకుంటూ వెళ్ళాలి. కానీ ఇంగ్లీష్ రాని, డబ్బులు లేని ఈ నలుగురు దొంగదారిని లండన్ వెళ్ళడానికి నిశ్చయం చేసుకుంటారు. దానికి ఒక మాజీ సైనికుడు హర్డీ సింగ్ సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ ఆ నలుగురూ వీసా కోసం పడే బాధలు, కష్టాలు అన్నీ వినోదాత్మకంగా చూపించారు దర్శకుడు రాజ్ కుమార్.
ఇందులో ఎన్నో భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇక తీరా వెళ్ళాక అక్కడ ఏమైనా వాళ్ళ బతుకులు, జీవితం బాగుపడిందా అంటే అదీ లేదు, అదీ కాకుండా, సొంత దేశం, సొంత వూరు, సొంత గడ్డ వదులుకొని ఎంత దూరం పోయినా వాళ్ళ మనసులు ఎప్పుడూ ఇక్కడే ఉంటాయి. మాతృ దేశం, దేశభక్తి ఇవన్నీ అంతర్లీనంగా తనదైన శైలిలో చూపించిన రాజ్ కుమార్ ఈ 'డంకి' సినిమా ద్వారా ఇప్పుడు విదేశాలకి ఇబ్బడిముబ్బడిగా ఎగబడుతున్న యువతకి ఒక సందేశంలా ఈ సినిమా ఉపయోగపడుతుంది.
ఎంతో వినోదాత్మకంగా, భావోద్వేగాలతో సన్నివేశాలు ఉంటాయి. రెండో సగంలోనే కొంచెం సాగదీత ఉంటుంది, కానీ అక్కడక్కడా మళ్ళీ భావోద్వేగ సన్నివేశాలతో, దేశభక్తిని మిళితం చేస్తూ చూపించారు. 'డంకి' సినిమా దేశభక్తిని చాటిచెపుతోంది. అలాగే మాతృదేశంలో తనవారందిరితో జీవిచటంలో వున్న సంతోషం, విదేశాలకు కేవలం డబ్బుకోసం వెళ్లడంలో వున్న ఆనందంతో పోలిస్తే అక్కడ ఏమీ ఉండదు అని పరోక్షంగా ఈ సినిమాతో చెప్పారు దర్శకుడు రాజ్ కుమార్.