21-12-2023 RJ
సినీ స్క్రీన్
తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా వరుస బయోపిక్స్ వస్తున్నాయి. పలువురు సినీ తారలతో పాటు క్రీడా, రాజకీయ ప్రముఖుల జీవిత కథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వీటిలో చాలా బయోపిక్స్ మంచి విజయాలను అందుకున్నాయి. అలాంటి వాటిలో 'యాత్ర' దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. మహి వి రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఎలక్షన్స్ ముందు విడుదల అయ్యింది.
ఈ మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు వైఎస్ జగన్ కు బాగా కలిసి వచ్చింది. యాత్ర' మంచి సక్సెస్ అందుకోవడంతో వైఎస్సార్ తనయుడు, ఆంధ్రప్రదేశ్ తాజా ముఖ్యమంత్రి జీవిత కథ ఆధారంగా సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మహి వీ రాఘవ్. 'యాత్ర 2’ పేరుతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో జీవా జగన్ పాత్రలో కనిపించబోతున్నారు.
ఇప్పటికే విడుదలైన 'యాత్ర 2' టైటిల్, మోషన్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వైఎస్ అభిమానులతో పాటు సినీ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది. గురువారం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బర్త్ డే కావడంతో 'యాత్ర 2'కు సంబంధించి మేకర్స్ కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్లో వైఎస్సార్గా మమ్ముట్టి కనిపించగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా జీవా దర్శనమిచ్చాడు. ఈ పోస్టర్ ను చూసి వైఎస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇక 'యాత్ర 2' సినిమా వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రను మెయిన్ గా చూపించబోతున్నట్లు సమాచారం. పాదయాత్రతో మొదలై, ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ సినిమా కథ కొనసాగనుందట. అంతేకాదు, జగన్ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు అనేది కూడా టచ్ చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ మీద ప్రతిపక్షాల కుట్రలను కూడా ఈ చిత్రంలో హైలెట్ చేయబోతున్నారట.
యాత్ర 2' చిత్రాన్ని త్రి ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 'యాత్ర' సినిమా ఫిబ్రవరి 8, 2019లో విడుదలకాగా, 'యాత్ర 2' ని కూడా అదే రోజు అంటే ఫిబ్రవరి 8, 2024న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.