21-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అంబేద్కర్ కోనసీమ, (డిసెంబర్ 21): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు గురువారం నాడు రామచంద్రపురంలో జరిగాయి. ఈ వేడుకల్లో బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘జగనన్న నన్ను రాజమండ్రి రూరల్కి అసెంబ్లీ సీటుకు వెళ్లమన్నారు. అన్నా.. నేను మీకు విధేయుడిని...మీరు కత్తి పట్టుకుని నన్ను నరికేస్తానంటే ఎందుకని అడగకుండా తలపెట్టగల సమర్థత, ధైర్యం నాకు ఉన్నాయని చెప్పాను.
టికెట్ విషయంలో జగన్ నన్ను అడగక ముందే పిల్లి సుభాష్ చంద్రబోస్ ని అడిగితే ఆయన కాళ్లు కడిగి తలమీద నీళ్లు జల్లుకుని ఆయనకు అప్పగించేవాడిని. అలా కాకుండా నన్ను ఒక దొంగగానో, వేరేరకంగానో చిత్రీకరించడం బాధించింది. నేను, నా కుమారుడు గాని అవినీతికి పాల్పడ్డారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. పార్టీకోసం త్యాగం చేసి వెళుతున్నాను. రామచంద్రపురం నియోజకవర్గంలో మళ్లీ అశాంతి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 30 ఏళ్ల శత్రువులైన ఎంపీ బోసు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను మిత్రులుగా మార్చిన ఘనుడ్ని నేను. దటీజ్ వేణుగోపాల్.
శెట్టి బలిజలకు బోస్ ఒక ఐకాస్. పెద్దాయన వంద మాటలు అన్నా నేను ఏనాడు విమర్శించలేదు. 2019 ఎన్నికల్లో నాకు అడ్రస్ లేదన్నారు.. కానీ ప్రజలు నాకు అడ్రస్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరు కాదు 20 మంది కలిసినా నా అడ్రస్ మారదు.. నా ఆధార్ కార్డు, నా ఇల్లు ఇక్కడే ఉంది. చివర్లో రామచంద్రపురాన్నిరక్షించాలని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు.