21-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 21): జగన్ చేసేదంత గోరంత, చెప్పేదేమో కొండంత అని ఏపీ సీఎం వైఎన్ జగన్మోహన్ రెడ్డిపై జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. జగన్ చేసేదంత గోరంత, చెప్పేదేమో కొండంత అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆలోచనతో ఎంతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చే లెక్కల్లోనే ఎంతో గందరగోళం కలిగిస్తున్నారని మండిపడ్డారు. ఆర్టికల్ 41 కింద సామాజిక భద్రతపై ప్రభుత్వానికి ఒక బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. దానిని ఉల్లంఘించడమే కాకుండా.. దారుణంగా వ్యవహరిస్తున్నారని, పేదలకు, పెత్తందార్లకు పోటీ అని ప్రగల్భాలు పలుకుతాడని మండిపడ్డారు.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులు, చేనేతే, మత్స్య, గీత కార్మికులు, ఎ.ఆర్.టి పెన్షన్లు ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఏడాది నవంబర్ నెలలో 54 లక్షల 69,161 పెన్షన్లు రూ. 2750 చొప్పున ఇచ్చామని చెప్పారు. సుమారుగా 1503 కోట్ల 99 లక్షల 17వేల 52 రూపాయులు వెచ్చించామని చెప్పారు. డిసెంబర్ లో ఈ పెన్షన్ల సంఖ్య 19,871 కి తగ్గిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక నెలలో ఇంతమందికి పెన్షన్లలో కోత పెట్టడం ఏమిటో పాలకుకలకే తెలియాలి. క్యాబినెట్ లో పెన్షన్లపై చర్చించి రూ. 2750 ని 3వేలకు పెంచుతున్నట్లు సీఎం చెప్పారు. నవంబర్ మాసానికి 65 లక్షల 33వేల పెన్షన్లు మంజూరు చేసినట్లు మంత్రి ప్రకటించారు. 1800 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో వేసినట్లు మంత్రి చెప్పారు. క్యాబినెట్ లో కూర్చుని చర్చించింది ఎంత, ఆమోదించింది ఎంత. అర్హత ఉన్న వ్యక్తులకు పెన్షన్లు నిలిపేసి, ఒక్క నెలలోనే వేల మందిని తొలగించారు.
క్యాబినెట్ లో పాలకులు ఇచ్చిన నోట్ ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. 10 లక్షల 64,712 మంది అర్హత కలిగిన వారిని మోసం చేసి, నెల లో రూ.292 కోట్లు గుటకాయ స్వాహా చేశారు. వెల్ ఫేర్ కార్పోరేషన్ కు 1800 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2023 సంవత్సరంలో 3513 కోట్ల 57 లక్షల 60 వేల రూపాయలు దోచుకున్నారు..' అని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొత్తగా పెంచిన మూడు వేలు తీసుకుంటే.. 4311కోట్ల 35 లక్షలు కూడా స్వాహాకు రెడీ అయ్యారు. పేద ప్రజలను లెక్కల గారడీలతో మోసం చేయడం దుర్మార్గం కాదా. వీటికి సీఎం, ఇతర మంత్రులు ఏం సమాధానం చెబుతారు. మీ మంత్రి వర్గ సమావేశంలోనే పొంత లేని గణాంకాలను ఎలా చెప్పారు. సమావేశంలో ఒక అంకెలు, బయటకు వచ్చి మరో అంకెలా.. ఈ గారడీలో ఇంకెంత దోచుకుంటారు.
బటన్ నొక్కడం ద్వారా ఎవరి ఖాతాల్లోకి ఎంత వెళుతున్నాయో అర్ధం కావడంలేదని కీలక అధికారులే చెబుతున్నారు. క్యాబినెట్ తీర్మానంలోనే ఇంత మతలబులు ఉంటే.. ఎవరిని అడగాలి. ఈ పెన్షన్ల బాగోతానికి సీఎం బయటకు వచ్చి సమాధానం చెబుతారా. రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్న విధానాన్ని ప్రజలకు వివరించాం. క్యాబినెట్ లో చేసిన తీర్మానాలను కూడా వక్రీకరిస్తూ... దొంగ లెక్కలు చెబుతున్నారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి, నిధుల దారి మళ్లిన వైనాన్ని త్వరలోనే బయట పెడతా. డిజిటల్ రూపంలో జరుగుతున్న లావాదేవీలపైనా ప్రజలకు వివరిస్తాం. హడావుడిగా క్యాబినెట్ మంత్రి అరగంటలో వచ్చి అబద్దాలు చెబుతున్నారు. నా లెక్కలు తప్పు అయితే.. చర్చించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను.' అని నాదెండ్ల మనోహర్ అన్నారు.