23-12-2023 RJ
తెలంగాణ
మెదక్, (డిసెంబర్ 23): ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన, అత్యుత్తమ కట్టడాల్లో ఒక్కటైన మెదక్ సీఎస్ఐ చర్చి క్రిస్మస్ శోభను సంతరించుకున్నది. విదద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులు చర్చిలో ప్రార్థనలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్రిస్మస్ వేడుకలను కనుల విందుగా జరిపేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేసారు. చర్చిని విద్యుత్ దీపాలతో అంగరంగ వైభవంగా ముస్తాబు చేసారు. 25న జరిగే క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.
క్రిస్మస్ వేడుకలకు మెదక్ నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు, పర్యాటకులు తరలివస్తుంటారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసినట్లు చర్చి కమిటీ సభ్యులు తెలిపారు. ఇక చర్చి ప్రాంగణంలో వివిధ రకాల గృహ అలంకరణ, ఆటబొమ్మల దుకాణాలు వెలిశాయి. రంగుల రాట్నం, మినీ ఈత కొలనులు, జంపింగ్ గేమ్స్, మినీసర్కస్, మినీరైల్, పిల్లలు ఆడుకునే ఆట బొమ్మలను ఏర్పాటు చేశారు. శనివారం నుంచే ప్రార్థనలు మొదలయ్యాయి. వేలాదిగా క్రిష్టియన్లు తరలి వస్తున్నారు.