25-12-2023 RJ
తెలంగాణ
రామగుండం, (డిసెంబర్ 25): సింగరేణిలో గత వారం నుంచి గనులు, వివిధ విభాగాల వద్ద జోరుగా ప్రచారం చేసిన నాయకులు చివరి రోజు సోమవారం కూడా కార్మికులు, ఉద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. తమకే ఓటేయాలని కార్మికులను కోరారు. సింగరేణిని కాపాడుకోవడం, మెరుగైన సౌకర్యాల కల్పనతో పాటు ప్రధాన సమస్యలపైనా అన్ని సంఘాలు హామీలు గుప్పిస్తున్నాయి. టీబీజీకేఎస్ ఆధ్వర్యం లో సాధించిన హక్కులు, సౌకర్యాలను వివరిస్తూ ఓట్లు అడిగారు. ప్రధానంగా టీబీజీకేఎస్ నాయకులు చివరి నిముషంలో పోటీలోకి దిగడంతో ప్రచారం జోరుగా సాగించారు. ప్రతి ఒక్క కార్మికుడిని కలువాలని ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నారు. మూడు షిఫ్టుల్లో కార్మికులను కలిసి ఓట్లు అడుగుతున్నారు.
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో విజయభేరి మోగించి కేసీఆర్కు గిప్ట్గా ఇవ్వాలని నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ సింగరేణికి చేసిన మేలును వివరిస్తూ ముందుకు సాగుతున్నారు. కారుణ్య నియమాకాల ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్లు, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే, ఐఐటీ, ఐఐఎంలలో సీటు సాధించిన కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికి రూ.10 లక్షల వడ్డీలేని రుణం, సింగరేణి ఏరియాల్లో నివసించే వారికి పట్టాల పంపిణీ, డ్యూటీలో మృతి చెందిన కార్మికుడికి రూ. 20 లక్షల పరిహారం, రిటైర్డ్మెంట్ వయసు 61కి పెంపువంటివి వివరిస్తూ ఓట్లు అడుగుతున్నారు.
టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత సూచనలతో అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య నాయకత్వంలో మూడోసారి గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సింగరేణి అభివృద్ధికి కేసీఆర్ సర్కారు ఎంతో కృషి చేసిందని, కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని కవిత పేర్కొన్నారు. జాతీయ సంఘాలు పోగొట్టిన డిపెండెంట్ ఉద్యోగాలు తిరిగి సాధించుకున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఎవరూ అధైర్య పడవద్ద.. మూడోసారి విజయం మనదే అని ఆమె పిలుపునిచ్చారు.