25-12-2023 RJ
తెలంగాణ
మెదక్, (డిసెంబర్ 25): క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రసిద్ధ మెదక్ సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెల్లవారుజాము 4 గంటలకు మొదటి ఆరాధనతో బిషప్ కే. పద్మారావు వేడుకలను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. పద్మారావు దైవ సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటున్న వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. చర్చికు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్చి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా మెదక్ చర్చి విద్యుత్ కాంతులతో జిగేల్మనేలా ఏర్పాట్లు చేశారు. భద్రాద్రి కొత్తగూడెంలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు.
కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లోని సెంట్ ఆండ్రూస్ చర్చిలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా, వైరా రోడ్ ఆర్సీఎం చర్చి, సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఇదిలావుంటే నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సతీమణి అనా కొణిదెల క్రిస్మస్ వేడుకలను అనాథ శరణాలయంలో నిర్వహించారు. హైదరాబాద్ బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్స్ ఆశ్రమంలోని చిన్నారులతో ముచ్చటించి.. వారికి విద్యాబుద్ధుల గురించి తెలియజేశారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి.. అందరికీ పంచిపట్టి.. నిత్యావసర సరుకులను అందజేశారు.