25-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
అమరావతి, (డిసెంబర్ 25): కక్షపూరిత రాజకీయాలతో జగన్ ప్రభుత్వం కాలం వెళ్లబుచ్చుతోందని తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్కీముల పేరుతో స్క్వాములకు పాల్పడుతోందని ఆరోపించారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో ప్రజాధనాన్ని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది.
పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం, జగన్ పాలనా వైఫల్యాలు అడుగడుగునా కనబడుతున్నాయి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రభుత్వం వెనక్కి తీసుకెళ్తుంది. రాష్ట్రంలో విధ్వంసం సృష్టించడం తప్ప అభివృద్ధి శూన్యం. ప్రభుత్వం ప్రజాస్వామిక, ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోంది. ప్రభుత్వ లోపాలు ఎత్తిచూపితే, అవినీతిని ప్రశ్నిస్తే కక్షగట్టి కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారు. పరిశ్రమలు రాకుండా పారిశ్రామికులను భయపెట్టి పలాయనం చిత్తగించేలా చేశారు.
జాకీ, లూలూ, రిలయన్స్, డేటా సెంటర్, అమర్ రాజా బ్యాటర్ కంపెనీలు ఏపీలో క్లోజ్ అయ్యాయి. దాదాపు 2లక్షల ఉద్యోగస్తులు రోడ్ల పాలయ్యారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24 శాతం ఉంది. రాష్ట్రంలో రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. రాజకీయాల పరంగా ప్రతిపక్ష నాయకుల ఆస్తులను వైసీపీ నేతలు ధ్వంసం చేస్తున్నారని ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు.