25-12-2023 RJ
తెలంగాణ
ఖమ్మం, (డిసెంబర్ 25): కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను వందరోజుల్లోగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం నాడు ఖమ్మంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తుమ్మల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియాగాంధీ ఆశీస్సులతో సుపరిపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు.
ప్రశాంతమైన ప్రగతిశీల ఖమ్మం అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో తన గెలుపుకు సహకరించిన వారికి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అవమానాలు సహించలేరు. ఆత్మ గౌరవం కోసం కాంగ్రెస్ సీపీఐ పార్టీలను గెలిపించిన ప్రజానీకానికి శిరస్సు వహించి నమస్కరిస్తోన్నాను. వసూళ్లు లేని కబ్జాలు లేని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటుంది.
తల వంచే పరిస్థితి జీవితంలో రాదు. సీతారామ ప్రాజెక్ట్ గత ప్రభుత్వంలో నత్త నడకన సాగింది. సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేసి గోదావరి జలాలతో సస్యశ్యామలం చేస్తాం. ఈ దేశానికే అన్నం పెట్టే శక్తి తెలంగాణకు ఉంది. పామాయిల్ సాగుతో రైతుల తలరాత మారుస్తాం. వ్యవసాయం రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతాం అని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.