25-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, (డిసెంబర్ 25): బీజేపీ ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో పురందేశ్వరి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ... 'ఏపీలోని గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తుంది. బీజేపీ అభివృద్ధి నిరోధకంగా పనిచేస్తుందని రాష్ట్ర ప్రభుత్వం దుష్పచారం చేస్తుంది. గ్రామ సడక్ యోజన వంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయి.
సమాజంలోని అట్టడుగు ప్రజలకు సంక్షేమం అందించడమే బీజేపీ లక్ష్యం. కేంద్ర నిధులు గ్రామాలకు చేరకపోతే ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ఏపీ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కేంద్రం ఇచ్చిన నిధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాం అని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. కేంద్రం మంజూరు చేస్తున్న ఇళ్లను కూడా పూర్తి చేయడం లేదన్నారు. అంతకుముందు దివంగత ప్రధాని వాజ్ పేయ్ చిత్రపటం వద్ద నివాళి అర్పించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మాజీ ప్రధాని వాజ్ పాయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పురందేశ్వరి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బీజేపీలో చేరిన పలువురు నేతలకు పురందేశ్వరి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. అటల్ బిహారీ వాజపేయి రాజకీయ నాయకుడు కాదని.. రాజనీతి కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి వాజపేయి అన్నారు. నేటి తరం రాజకీయకులకు వాజపేయి ఆదర్శంగా నిలుస్తారన్నారు. అభివృద్ధి చెందిన దేశాన్ని 2047 కల్లా చూడాలన్నదే మోదీ లక్ష్యమని పురందేశ్వరి అన్నారు. ఇక విద్యా విధానంలో ప్రధాని మోదీ మార్పులు తెచ్చారన్నారు. కానీ బీజం పడింది మాత్రం వాజపేయి హయాంలోనేనన్నారు.
సర్వ శిక్ష అభియాన్ ద్వారా పిల్లలకు యూనిఫారం, బూట్లు ఇవ్వాలని వాజపేయి ఎప్పుడో నాంది పలికారన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవన్నీ తామే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారున్నారు. పారదర్శకతకు నాంది వాజపేయి హయాంలో పలికినా ప్రధాని మోదీ పాటిస్తున్నారన్నారు. వాజపేయి నిజమైన వారసులు బీజేపీ కార్యకర్తలేనన్నారు. 7 న విశాఖలో ఓబీసీ మోర్చా బహిరంగ సమావేశం నిర్వహిస్తున్నామని పురందేశ్వరి పేర్కొన్నారు.