26-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 26): గురుగోవింద్ సింగ్ పోరాటం చాలా గొప్పదని.. వారి కుమారుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానిం చారు. మంగళవారం నాడు వీర్ బాల్ దినోత్సవం సందర్భంగా అమీర్ పేట లోని గురుద్వార్ ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ కుమారులైన.. బాబా జోరావర్ సింగ్ (9 ఏళ్లు), బాబా ఫతే సింగ్ (6 ఏళ్లు) ధర్మ కోసం బలిదానం అయ్యారని.. వారి పెద్ద కుమారులు సైతం మొఘల్ సైన్యంతో పోరాటం చేసి ధర్మం కోసం బలిదానం చేశారని చెప్పారు. చివరకు గురుగోవింద్ సింగ్ ఇద్దరు పుత్రులు కూడా ఔరంగజేబు సైన్యం బంధించి సిక్కు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేసిందన్నారు.
ఇస్లాంను స్వీకరించాలి, సిక్కు మతాన్ని వదిలేయాలని అనేక రకాలుగా వేధింపులకు, దౌర్జన్యాలకు గురిచేశారని కిషన్ రెడ్డి తెలిపారు. మతం మారే ప్రసక్తే లేదని ఆ ఇద్దరు పసిపిల్లలు ఔరంగజేబుకు, మొఘల్ సైన్యానికి సవాల్ విసిరారని చెప్పారు. చివరకు ఆ ఇద్దరు పసిపిల్లలను నిర్దాక్షిణ్యంగా ప్రాణాలతో సమాధి చేసి వారిని బలిగొన్నారని.. వారి త్యాగనిరతికి స్ఫూర్తిగా డిసెంబరు 25వ తేదీన ఢిల్లీలో కేంద్ర సాంస్కృతిక శాఖ అధ్వర్యంలో 'వీర బాల్ దివస్' నిర్వహించాలని దేశమంతా వేలాది కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. దేశంలోని చాలామంది మంత్రులు, ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు అనేక ప్రాంతాల్లో గురుద్వార్ కు వెళ్లి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారని గుర్తుచేశారు.
వీర పోరాటంలో మరణించిన వీర బాలలకు ఈరోజు నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నానని కిషన్ రెడ్డి అన్నారు. గురుగోవింద్ సింగ్ చేసిన పోరాటం గురించి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి వీడియోల ద్వారా కేంద్ర ప్రభుత్వం వివరిస్తోందని తెలిపారు. విదేశీయులతో, ఆక్రమణ దారులతో పోరాటం చేసిన గురుగోవింద్ సింగ్, వారి తనయులను మనందరం కూడా స్మరించు కోవాలని... వారి స్ఫూర్తితో దేశ అభివృద్ధి కోసం ముందడుగు వేయాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.