26-12-2023 RJ
తెలంగాణ
మహబూబాబాద్, (డిసెంబర్ 26): జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న వెనకబడిన మండలాలు కొత్తగూడ, గంగారం అభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. మంగళవారం మంత్రి కొత్తగూడ మండలంలో విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, ఐ.టి.డి.ఎ. పీఓ అంకిత్ తో కలిసి లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రెండు మండలాల్లో తాగునీటి కొరత అధికంగా ఉన్నందన నిరంతరంగా నీళ్లు అందించే విధంగా అధికారులు దృష్టి సారించాలన్నారు. అంగన్వాడీ కేంద్ర భవనాలకు మరమ్మతులు ఉంటే నిధులు మంజూరు చేస్తానని, అన్ని వసతులు కల్పించాలన్నారు. రాష్ట్రంలోని 14 వేల పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తమ దృష్టిలో ఉందని త్వరలోనే భర్తీ చేస్తామని తెలియజేశారు. నిధులు మంజూరైన చోట త్వరితగతిన
పనులు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు బ్యాంక్ అదనపు బ్రాంచికి కోరినందున త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాపాలనను అంకిత భావంతో చేపట్టి విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ ట్రైబల్ వెల్ఫేర్ ఎర్రయ్య, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ హేమలత, తదితరులు పాల్గొన్నారు.