26-12-2023 RJ
తెలంగాణ
హైదరాబాద్, (డిసెంబర్ 26): తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభివృద్ధిలో రాష్ట్రాన్ని నెంబర్ వన్గా నిలబెడతామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని.. ఫాక్స్కాన్ సంస్థ తెలంగాణలో చేపట్టబోయే భవిష్యత్ ప్రాజెక్టులకు కూడా అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని ఫాక్సాకాన్ ప్రతినిధులు మంగళవారం కలిశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీఎస్ శాంతి కుమారి ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫాక్స్కాన్ కు చెందిన హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీస్ ప్రతినిధి వీలీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో పలు అంశాలపై చర్చించారు. కొంగర కలాన్ ఉత్పాదక కేంద్రం నిర్వహణకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని సీఎం హామినిచ్చారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలను కాపాడే భాద్యత కొత్తగా ఏర్పడిన తమ ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలకు స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని.. పారిశ్రామిక వేత్తలకు కూడా పూర్తి సహాయ, సహకారాలందిస్తామని అన్నారు. పరిశ్రమల అభివృద్ధి, ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు సులభంగా అందించడం తోపాటు, మౌలిక సదుపాయాలను కల్పిస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకుంటామని తెలియజేసారు. కాగా.. లక్ష ఉద్యోగాలను కల్పిస్తామనే హామీతో ఫాక్స్కాన్ గ్రూప్ మార్చ్ 2023లో తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం చేసుకుంది. మొదటి దశలో అంటే వచ్చే రెండేళ్లలో 25 వేల ఉద్యోగాలను ఫాక్స్కాన్ సంస్థ కల్పించనుంది. ఫాక్స్ కాన్ సంస్థ ఆపిల్ ఐఫోన్లను ప్రధానంగా తయారుచేస్తుంది. చైనా, వియత్నాం, థాయ్లాండ్, మలేషియా, అమెరికా, యూరప్, భారత్ సహా 24 దేశాలలో ఫాక్సాకాన్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నది. మన దేశంలో ఏపీ (శ్రీ సిటి), తమిళనాడు (శ్రీ పెరంబుదూర్), తెలంగాణ (కొంగర కలాన్), కర్ణాటక (బెంగళూరు సమీపంలో) సంస్థ పనిచేస్తున్నది. ఫాక్స్ కాన్ సంస్థ ఎలక్ట్రాన్రిక్స్ పరికరాలు, ఉపకరణాలు తయారుచేసే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది.