27-12-2023 RJ
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్టణం, (డిసెంబర్ 27): తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెల్లవారి 7 గంటలైనా సూర్యుడు కనిపించని పరిస్తితి నెలకొంది. ఓ వైపు పొగమంచుతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరోవైపు విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. చలినుంచి ఉపశమనం కోసం చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. పొగమంచు కమ్మేయడంతో రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో పొగమంచుకమ్మేసింది. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోయాయి. మరోవైపు యాదాద్రిలోనూ పొగమంచు కమ్మేయడంతో ఇటు స్థానికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రమైన పొగమంచు కురుస్తుండటంతో స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
విద్యార్థులు స్కూలుకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇటు హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మంచు కురుస్తుండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు దట్టంగా అలముకున్న పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటోంది. తెల్లవారుజామును కురుస్తున్న మంచు తుంపరలను ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరు ఏజెన్సీలో మంచు కొండలు కాశ్మీరును తలపిస్తున్నాయి. సూర్యోదయం వేళ వెండికొండల్లా మెరుస్తున్న వంజంగి మేఘాలకొండ అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. కాగా పాడేరును దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఇక్కడి ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలుగా నమోదు అయ్యాయి.
ఇకపోతే పొగమంచు ప్రాణాలు మీదకు తీసుకొస్తోంది. ఉదయాన్ని ప్రయాణించే వాళ్లంతా అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సి వస్తోంది. ఎంత జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తున్నా ప్రమాదాలు మాత్రం ఆగడంలేదు. మొన్నటికి మొన్న మంచు ప్రభావంతో తెలంగాణలో రెండు ప్రమాదాలు జరిగాయి. అందులో ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇప్పుడు వైజాగ్ లో కూడా అలాంటి ప్రమాదమే జరిగింది. విశాఖ కొమ్మాది కూడలి వద్ద వరుసగా ఐదు వాహనాలు ఢీ కొన్నాయి. ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. కొమ్మాది జంక్షన్ వద్ద ముందు ప్రైవేట్ బస్సు, ట్యాంకర్ ఢీ కొట్టింది. ముంచు కారణంగా ఆ ప్రమాదాన్ని పసిగట్టలేకపోయిన కార్లు కూడా దా వాహనాలను ఢీకున్నాయి. ఏకంగా మూడు కార్లు ఆ వెహికల్స్ ను ఢీ కొట్టాయి. ఐదు వాహనాలు ఢీ కొన్న ఘటనతో కొమ్మాదిలో పూర్తిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ప్రమాదానికి అటూ ఇటూ భారీగా వాహనాలు జామ్ అయ్యాయి. అసలే పొగమంచు ఇటు ట్రాఫిక్, చలి కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గంటల తరబడి రోడ్డుపైనే ఉండిపోవాల్సి వచ్చింది.